Apple Siri Violation Fine :వ్యక్తిగత గోప్యతకు ప్రాధాన్యమిస్తామన్న యాపిల్ ఐఫోన్ వినియోగదారులపై నిఘా వేసినందుకు భారీగా పరిహారం చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆ సంస్థకు చెందిన వర్చ్యువల్ అసిస్టెంట్ 'సిరి' ఐఫోన్ ఇతర పరికరాల్లో వినియోగదారుల సంభాషణలను వింటోందన్న ఆరోపణలు ఎదుర్కొంటోంది. ఇందుకోసం సిరిని రహస్యంగా యాక్టివేట్ చేసినట్లు ఐదేళ్ల క్రితం దాఖలైన వ్యాజ్యాన్ని సెటిల్ చేసుకొనేందుకు యాపిల్ ఇప్పుడు 95 మిలియన్ డాలర్లు (సుమారు రూ.814 కోట్లు) చెల్లించేందుకు అంగీకరించింది. ఈమేరకు ఇటీవల కాలిఫోర్నియాలోని ఓక్లాండ్ న్యాయస్థానంలో ప్రతిపాదనలను దాఖలు చేసింది.
అసలేం జరిగిందంటే?
వర్చ్యువల్ అసిస్టెంట్‌ను యాక్టివేట్ చేసే కీలకమైన 'హే సిరి' వంటివి వినియోగదారులు పలక్కపోయినా అది యాక్టివేట్ అయి మాటలను రికార్డు చేసేదని ఈ వ్యాజ్యంలో ఆరోపించారు. వీటిల్లో కొన్ని సంభాషణలను వాణిజ్య ప్రకటనలు జారీ చేసేవారితో షేర్ చేసుకొనేదని ఆరోపించారు. దీనిని వాడుకొని వారు ప్రొడక్టులు విక్రయించేవారని లా సూట్లో పేర్కొన్నారు. కాగా, వినియోగాదారుల వ్యక్తిగత గోప్యతను కాపాడతామన్న యాపిల్ హామీలకు ఇది పూర్తి భిన్నంగా ఉంది. అలాగే యాపిల్ సీఈఓ టిమ్ కుక్ కూడా తరచూ వ్యక్తిగత గోప్యతను ప్రాథమిక హక్కుగా చెబుతుంటారు.
తప్పును అంగీకరించని యాపిల్!
అయితే ఈ సెటిల్మెంట్ సందర్భంగా యాపిల్ తాము తప్పు చేసినట్లు ఎక్కడా అంగీకరించలేదు. దీనిపై విచారణ ఈ ఏడాది ఫిబ్రవరి 14న జరగనుంది. ఈ సెటిల్మెంట్ ఆమోదం పొందితే 2014 సెప్టెంబర్ 17 నుంచి యాపిల్ ఐఫోన్లు, డివైజ్‌లు వాడుతున్న 10 లక్షల మంది క్లెయిమ్ లు దాఖలు చేసుకోవచ్చు. ప్రతి వినియోగదారుడు అత్యధికంగా 20 డాలర్ల వరకు పొందే అవకాశం ఉంటుంది.