Anant Ambani Pre Wedding Celebration : రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముకేశ్ అంబానీ ఇంట్లో త్వరలో పెళ్లి బాజాలు మోగనున్నాయి. ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ వివాహ వేడుకకు అంబానీ ఫ్యామిలీ సిద్ధమవుతోంది. అందులో భాగంగా వీరి ప్రీ వెడ్డింగ్ వేడుకలు గుజరాత్‌లోని జామ్ నగర్‌లో అట్టహాసంగా జరగనున్నాయి. మార్చి 1-3 తేదీల మధ్య జామ్‌నగర్‌లోని రిలయన్స్ కాంప్లెక్స్‌లో మూడు రోజుల పాటు ప్రీ వెడ్డింగ్ వేడుకలు ఘనంగా జరగనున్నాయి.
బిలీయనర్ల నుంచి స్టార్ల వరకు!
జామ్‌నగర్‌లో జరిగే ప్రీ వెడ్డింగ్ వేడుకలకు అంతర్జాతీయ ప్రముఖులు అంతా తరలిరానున్నారు. బిలియనీర్ల దగ్గర నుంచి బాలీవుడ్ హీరోల వరకు ఇంటర్నేషనల్ సెలబ్రిటీలు అందరూ అంబానీ వారింట పెళ్లి సందడిలో పాల్గొంటారు. మెటా సీఈఓ మార్క్ జుకర్ బర్గ్, మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్, అడోబ్ సీఈఓ శంతను నారాయణ్ సహా తదితరులు హాజరుకానున్నారు.
భూటాన్ రాజు, రాణి కూడా!
వీరితో పాటు బ్లాక్‌రాక్ సీఈఓ ల్యారీ పింక్, బ్లాక్‌స్టోన్ ఛైర్మన్ స్టీఫెన్ స్క్వార్జ్‌మ్యాన్, డిస్నీ సీఈఓ బాబ్ ఐగర్, ఇవాంకా ట్రంప్, ఖతార్ ప్రధాని మహ్మద్ బిన్ అబ్దుల్ రహమాన్ అల్‌థాని విచ్చేయనున్నారు. మోర్గాన్ స్టాన్లీ, బ్యాంక్ ఆఫ్ అమెరికా, బెర్క్‌షైర్ హాథ్‌వే వంటి ప్రముఖ కంపెనీల ప్రతినిధులతో పాటు కెనడా, స్వీడన్, ఆస్ట్రేలియా, బొలీవియా దేశాల మాజీ ప్రధానులు, భూటాన్ రాజు, రాణి తదితరులు ఈ వేడుకకు హాజరుకానున్నారు.
భారతీయ సంస్కృతిని పరిచయం చేసేలా!
అనంత్, రాధిక ప్రీ వెడ్డింగ్ ఈవెంట్‌కు వచ్చే విశిష్ట అతిథులను సాదరంగా స్వాగతం పలికేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. అతిథులకు స్వాగతం పలికేందుకు గుజరాత్‌లోని లాల్‌పుర్, కచ్‌లో మహిళలు తయారు చేసిన కండువాలను సిద్ధం చేశారు. అలాగే ప్రీ వెడ్డింగ్ వేడుకల్లో భారతీయ సంస్కృతిని ఇంటర్నేషనల్ సెలబ్రిటీలకు పరిచయం చేయాలని అంబానీ ఫ్యామిలీ ఆలోచిస్తోందట.