HDFC Bank Scheduled Downtime :మనదేశంలోని అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంక్ అయిన హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ (HDFC bank) జులై 13న తమ సిస్టమ్‌ను అప్‌గ్రేడ్ చేయనున్నట్లు తెలిపింది. కస్టమర్లకు మెరుగైన సేవలు అందించేందుకు, బ్యాంకింగ్ అనుభూతిని మరింత మెరుగుపరిచేందుకు ఈ అప్‌గ్రేడ్ చేస్తున్నట్లు స్పష్టం చేసింది. జులై 13న (శనివారం) ఉదయం 3 గంటల నుంచి ఆ రోజు సాయంత్రం 4.30 గంటల వరకు ఈ అప్‌గ్రేడ్ ప్రక్రియ కొనసాగనుంది. కనుక ఆ సమయంలో ఖాతాదారులకు కొన్ని సర్వీసులు అందుబాటులో ఉండవని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఓ ప్రకటనలో తెలిపింది.
కస్టమర్ల పరిస్థితి ఏమిటి?
సుమారు 13.30 గంటల పాటు ఈ అప్‌గ్రేడ్ ప్రక్రియ కొనసాగుతుంది. కనుక ఆ సమయంలో బ్యాంకింగ్, పేమెంట్ సేవలు తాత్కాలికంగా అందుబాటులో ఉండవని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తెలిపింది. కస్టమర్లు ఎలాంటి అసౌకర్యానికి గురికాకుండా ఉండేందుకు, జులై 12నే తగినంత మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవాలని, ఏవైనా చెల్లింపులు చేయాల్సి ఉంటే, వాటిని ముందస్తుగానే చేసుకోవాలని సూచించింది. తమ ఖాతాదారులపై ప్రభావం తగ్గించేందుకే, సెలవు రోజున అప్‌గ్రేడింగ్ ప్రక్రియను చేపడుతున్నామని తెలిపింది. కనుక దీనికి అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేసింది.