Wiz Rejected Google Offer :ప్రపంచ అగ్రగామి సంస్థ గూగుల్ నుంచి వచ్చిన భారీ ఆఫర్‌ను విజ్ అనే సైబర్ సెక్యూరిటీ స్టార్టప్ తిరస్కరించింది. 23 బిలియన్ డాలర్లు (సుమారు రూ.2 లక్షల కోట్లు)కు గూగుల్ ఇచ్చిన ఆఫర్‌ను వదులుకుంది. ఆ కంపెనీ ఎందుకు గూగుల్ ఆఫర్‌ను తిరస్కరించింది? విజ్ స్టార్టప్ కొనుగోలుకు గూగుల్ అంత పెద్ద మొత్తం ఇవ్వజూపడానికి గల కారణాలేమిటి? తదితర వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
సైబర్ సైక్యూరిటీ స్టార్టప్ 'విజ్'ను గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపింది. విజ్‌కు 23 బిలియన్ డాలర్ల భారీ మొత్తాన్ని ఆఫర్ చేసింది. ఇదే కనుక జరిగితే ఈ ఒప్పందం గూగుల్ అతిపెద్ద కొనుగోళ్లలో ఒకటి అయ్యుండేది. అయితే విజ్ సహ వ్యవస్థాపకుడు అసాఫ్ రాపాపోర్ట్ గూగుల్ ఆఫర్‌ను తిరస్కరించడానికి గల కారణాన్ని, తమ సంస్థ సిబ్బందికి పంపిన అంతర్గత మోమోలో వెల్లడించినట్లు సీఎన్‌బీసీ తన నివేదికలో పేర్కొంది. అందులో ఏముందంటే?
నో చెప్పడం కష్టమే - కానీ
విజ్ కంపెనీ ఐపీఓకు వెళ్లేందుకు ఆసక్తిగా ఉందని ఆ సంస్థ సహ వ్యవస్థాపకుడు అసాఫ్ రాపాపోర్ట్ సిబ్బందికి పంపిన మోమోలో తెలిపారు. 'గూగుల్ ఆఫర్‌కు నో చెప్పడం కష్టమే. విజ్ ఇప్పుడు గూగుల్ ఆఫర్ కంటే, ముందుగా నిర్దేశించుకున్న లక్ష్యంపై దృష్టి సారిస్తోంది. ఐపీఓతో పాటు, వార్షిక రికరింగ్ రెవెన్యూలో 1 బిలియన్ డాలర్లు సాధించాలని కంపెనీ లక్ష్యంగా పెట్టుకుంది' అని అసాఫ్ ఉద్యోగులకు పంపిన మోమోలో రాసికొచ్చినట్లు సీఎన్‌బీసీ నివేదికలో పేర్కొంది. అయితే ఈ డీల్ గురించి గూగుల్ కానీ, విజ్ గానీ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.