50/30/20 Budget Rule Explained :భవిష్యత్ సుఖమయంగా ఉండాలంటే, ప్రతి ఒక్కరూ పొదుపు చేయడం తప్పనిసరి. ఇందుకోసం చాలా మంచి సేవింగ్స్ అకౌంట్‌ను ఓపెన్ చేస్తూ ఉంటారు. అయితే దీని కంటే ముందు మీరు 50-30-20 సూత్రం గురించి తెలుసుకోవాలి. దీని ద్వారా సరైన మార్గంలో పొదుపు, మదుపు చేసి భవిష్యత్‌ను ఆర్థికంగా సుస్థిరం చేసుకోవచ్చు.
నిపుణుల మాట
వాస్తవానికి మనకు వచ్చిన ఆదాయం మొత్తాన్ని ఖర్చు పెట్టేయకూడదు. అవసరాలకు అనుగుణమైన ఖర్చులు చేసి, మిగతాది పొదుపు చేసుకోవాలి. ఇందుకోసం మంచి బడ్జెట్ వేసుకోవాలి. చాలా మంది ఆర్థిక నిపుణులు ఇందుకోసం 50-30-20 సూత్రాన్ని పాటించాలని సూచిస్తున్నారు. ఆదాయ-వ్యయాలను సమర్థవంతంగా నిర్వహించడానికి ఇది బాగా ఉపయోగపడుతుందని స్పష్టం చేస్తున్నారు.
50-30-20 సూత్రం
మీకు వచ్చిన ఆదాయంలో 50 శాతం మొత్తాన్ని గృహ అవసరాల కోసం కేటాయించాలి. అంటే నిత్యావసరాలు, ఫీజులు, రవాణా, రుణ వాయిదాల చెల్లింపు మొదలైన వాటి కోసం ఉపయోగించాలి. 30 శాతం మొత్తాన్ని వస్తువుల కొనుగోళ్ల కోసం, మీ కుటుంబ సభ్యుల సరదా, సంతోషాల కోసం వాడుకోవాలి. మిగతా 20 శాతం సొమ్మును కచ్చితంగా పొదుపు, మదుపులకు మళ్లించాలి.
ఒక వేళ మీ ఖర్చులకు, అవసరాలకు అధిక మొత్తం అవసరమైతే, ముందుగా చెప్పిన సరదా, సంతోషాల కోసం చేసే ఖర్చులను తగ్గించుకోవాలి. పొదుపు ఖాతాలో జమ చేసిన మొత్తంలో మీ అవసరాలకు తగినంత సొమ్మును ఉంచుకుని, మిగతా డబ్బులను పెట్టుబడులకు మళ్లించాలి.
అత్యవసర నిధి ఏర్పాటు
మన జీవితంలో ఎప్పుడు, ఎలాంటి ఆర్థిక అవసరాలు వస్తాయో చెప్పలేము. కనుక కచ్చితంగా అత్యవసర నిధిని ఏర్పాటు చేసుకోవాలి. కనీసం 6 నుంచి 12 నెలలకు సరిపోయే డబ్బులను అత్యవసర నిధిగా పెట్టుకోవాలి. అంతేకాదు ఈ మొత్తాన్ని మీ సేవింగ్స్ అకౌంట్లనే వేయాలి. ఒకేసారి అంత పెద్ద మొత్తం నిధిని జమ చేయలేమని అనుకుంటే, మీకు వీలైనంత కనీస మొత్తాలను పొదుపు చేస్తూ వెళ్లండి. అంతేకానీ, మన వల్ల కాదు అని వదిలేయకండి.