Youth Swallowed Metal Objects:మొబైల్లో పబ్జీ వీడియో గేమ్ ఆడుకోవడానికి కుటుంబ సభ్యులు నిరాకరించారని, తాళం చెవి, నాలుగు అంగుళాల కత్తి, నెయిల్ కట్టర్లు మింగేశాడు ఓ యువకుడు. దీంతో ఆరోగ్యం విషమించి ఆస్పత్రి పాలయ్యాడు. సర్జరీ చేసి బాధితుడి కడుపులోంచి మెటల్ వస్తువులను బయటకు తీశారు వైద్యులు. ఈ ఘటన బిహార్ తూర్పు చంపారన్ జిల్లాలో జరిగింది.
ఇదీ జరిగింది
మోతిహారీలోని చాంద్మారి ప్రాంతానికి చెందిన 22 ఏళ్ల ఓ వ్యక్తి, మొబైల్లో వీడియో గేమ్లకు అలవాటుపడ్డాడు. ఈ క్రమంలో వీడియో గేమ్ ఆడొద్దని కుటుంబ సభ్యులు వారించారు. దీంతో యువుకుడు, తాళం చెవి, కీ రింగ్, చిన్న కత్తి, నెయిల్ కట్టర్లు వంటి మెటల్ వస్తువులు మింగాడు. అయితే కొన్ని గంటల తర్వాత బాధితుడి పరిస్థితి విషమించింది. వెంటనే అప్రమత్తమైన కుటుంబ సభ్యులు ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ బాధితుడికి వైద్యులు సోనోగ్రఫీ, అల్ట్రాసౌండ్ స్కానింగ్ తీశారు. యువకుడి పొట్టలో కనిపించిన వస్తువులు చూసి కంగుతిన్నారు.
"యువకుడు మానసిక అనారోగ్యంతో ఉన్నాడు. దాదాటు గంటపాటు ఆపరేషన్ చేసి, అతడి కడుపులో నుంచి తాళం చెవి, ఒక కత్తి, రెండు నెయిల్ కట్టర్లు, చిన్న మెటల్ వస్తువులను తొలగించాము. ప్రస్తుతం అతడి పరిస్థితి నిలకడగా ఉంది" అని డాక్టర్ అమిత్ కుమార్ చెప్పారు.