Doctors Forgot Needle In Woman Stomach :శస్త్రచికిత్స సమయంలోకర్ణాటకకు చెందిన ఓ మహిళ కడుపులో వైద్యులు సర్జికల్ సూదిని మరిచినందుకు బాధితురాలికి రూ.5 లక్షల నష్ట పరిహారం అందించాలని కర్ణాటక వినియోగదారుల ఫోరం ఆదేశించింది. వ్యాజ్య ఖర్చుల కింద రూ.50వేలు చెల్లించాలని ఆస్పత్రితోపాటు వైద్యులకు ఆదేశాలు జారీ చేసింది. ఫిర్యాదు చేసిన సుమారు 14 ఏళ్ల తర్వాత సదరు మహిళకు న్యాయం జరిగింది!
అసలేం జరిగిందంటే?
బెంగళూరులోని జయనగర్‌కు చెందిన పద్మావతి సుమారు 20 ఏళ్ల క్రితం అంటే 2004 సెప్టెంబర్ 29వ తేదీన దీపక్ ఆస్పత్రిలో హెర్నియా ఆపరేషన్ చేయించుకుంది. అప్పటికి ఆమె వయసు 32 ఏళ్లు. ఆపరేషన్ జరిగిన కొద్ది రోజులకే తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడింది. దీంతో వైద్యులను సంప్రదించగా, కొన్ని పెయిన్ కిల్లర్ ట్యాబ్లెట్స్ ఇచ్చారు. కొద్ది రోజుల్లో నొప్పి అంతా తగ్గిపోతుందని చెప్పారు.
3.2 సెంటీమీటర్ల సర్జికల్ సూది!
కానీ ఆ మహిళకు కడుపు నొప్పి, వెన్ను నొప్పి అస్సలు తగ్గలేదు. శస్త్ర చికిత్స జరిగిన తర్వాత రెండు సార్లు అదే ఆస్పత్రిలో చేరింది. మళ్లీ వైద్యులు ట్యాబ్లెట్సే ఇచ్చారు. దీంతో మరో ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లి స్కానింగ్ చేయించుకుంది సదరు మహిళ. అప్పుడు ఆమె పొత్తికడుపులో సర్జికల్ సూది ఉన్నట్లు నిర్ధరణ అయింది. వెంటనే అక్కడి వైద్యులు ఆమెకు శస్త్రచికిత్స చేసి 3.2 సెంటీమీటర్ల సర్జికల్ సూదిని బయటకు తీశారు.
తీవ్రమైన నొప్పిని!
అదే సమయంలో ఆ మహిళ తన కడుపులో సూది మరిచిన దీపక్ ఆస్పత్రి వైద్యులపై వినియోగదారుల ఫారమ్‌ను ఆశ్రయించింది. దీనిపై తాజాగా తీర్పునిచ్చింది వినియోగదారుల ఫోరమ్. కడుపులో వైద్యులు మరిచిన సూదిని తొలగించే వరకు తీవ్రమైన నొప్పిని, అసౌకర్యాన్ని మహిళ ఎదుర్కొందని తెలిపింది. వైద్యపరమైన నిర్లక్ష్యం జరిగినందుకు పాలసీ కంపెనీ న్యూ ఇండియా అష్యూరెన్స్ కో లిమిటెడ్ మహిళకు రూ.5లక్షలు చెల్లించాలని ఆదేశించింది. వ్యాజ్య ఖర్చుల కింద రూ.50 వేలు చెల్లించాలని వైద్యులకు ఆదేశాలు జారీ చేసింది.