Woman Fell Into Borewell : ప్రమాదవశాత్తు 25 ఏళ్ల మహిళ 100 అడుగులు లోతున్న బోరుబావిలో పడిపోయింది. ఈ ఘటన రాజస్థాన్లోని గంగాపూర్ జిల్లాలో జరిగింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న అధికారులు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దింపారు. గంగాపుర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ గౌరవ్ సైనీ ఆధ్వర్యంలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది.
ప్రమాదమా? హత్యా?
జిల్లాలోని గుడ్లా గ్రామానికి చెందిన 25 ఏళ్ల మోనా భాయి మంగళవారం రాత్రి 8 గంటల నుంచి కనిపించకుండా పోయింది. ఈ క్రమంలో బుధవారం ఇంటివెనక పొలంలో తవ్వి ఉన్న బోరుబావి సమీపంలో ఆమె వేసుకున్న చెప్పులను గుర్తించారు కుటుంబ సభ్యులు. దీంతో మోనా బోరుబావిలో పడిపోయి ఉంటుందనే అనుమానంతో వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మోనా భాయి ప్రమాదవశాత్తు బోరుబావిలో పడిపోయిందా? లేదా ఎవరైనా తోసేసి ఉంటారా? అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
'గుడ్లా గ్రామంలో 25 ఏళ్ల మహిళ బోరుబావిలో పడిపోయిందనే సమాచారం మాకు బుధవారం మధ్యాహ్నం అందింది. దీంతో సహాయక బృందాలతో మేము ఆ ప్రాంతానికి చేరుకున్నాం. గృహిణి ఇంటి వెనక పొలంలో తవ్వి ఉన్న బోరుబావి లోతు 100 అడుగులుగా తెలుస్తోంది. అయితే మహిళను ఎవరైనా తోసేశారా? లేదా ఆమెనే ప్రమాదవశాత్తు పడిందా? అనే వివరాలు తెలియాల్సి ఉంది. దర్యాప్తు కొనసాగుతోంది. ప్రస్తుతం లోపల ఉన్న ఆమెకు ఆక్సిజన్ సరఫరా చేశాం.' అని బమన్వాస్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సంత్రమ్ తెలిపారు.