తెలంగాణ

telangana

ETV Bharat / bharat

భార్య ఆత్మహత్య కేసు- 30ఏళ్లకు భర్తను నిర్దోషిగా ప్రకటించిన సుప్రీం

Wife Suicide Husband Innocence Case : ఓ వ్యక్తి తన భార్య ఆత్మహత్య కేసులో నిర్దోషిత్వాన్ని నిరూపించుకునేందుకు 30 ఏళ్లు పట్టింది. మహిళ ఆత్మహత్యకు ప్రేరేపించిన భర్తను దోషిగా తేల్చడానికి అతడు వేధింపులకు పాల్పడ్డాడన్న ఆరోపణలు సరిపోవని సుప్రీంకోర్టు తెలిపింది. ఈ క్రమంలో భర్తను నిర్దోషిగా తేలుస్తూ తీర్పునిచ్చింది.

Wife Suicide Husband Innocence Case
Wife Suicide Husband Innocence Case

By ETV Bharat Telugu Team

Published : Feb 28, 2024, 9:20 PM IST

Updated : Feb 29, 2024, 8:39 AM IST

Wife Suicide Husband Innocence Case :భార్యను వేధింపులకు గురిచేసి ఆమె ఆత్మహత్యకు కారణమయ్యాడనే కేసులో నిర్దోషిత్వాన్ని నిరూపించుకోవడానికి 30 ఏళ్ల సుదీర్ఘ న్యాయపోరాటం చేశాడు ఓ వ్యక్తి. ఈ కేసుపై సుప్రీంకోర్టు సైతం ఆవేదన వ్యక్తం చేసింది. తన నిర్దోషిత్వాన్ని రుజువు చేసుకోవడానికి పిటిషనర్​కు 30ఏళ్లు పట్టిందని అసహనం వ్యక్తం చేసింది.

మహిళ ఆత్మహత్యకు ప్రేరేపించిన భర్తను దోషిగా తేల్చడానికి అతడు వేధింపులకు పాల్పడ్డాడన్న ఆరోపణలు సరిపోవని సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్​ జేబీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం పేర్కొంది. ఏ నేరానికి కూడా నిందితులు శిక్ష పడకుండా తప్పించుకోకూడదని వ్యాఖ్యానించింది. అదే సమయంలో చేసిన నేరాలకు చట్టపరమైన సాక్ష్యాల ఆధారంగానే నిందితులకు శిక్షను నిర్ధరించాలని పేర్కొంది.

హరియాణాకు చెందిన నరేశ్ కుమార్ అనే వ్యక్తి భార్య 1993లో ఆత్మహత్య చేసుకుంది. భర్త(నరేశ్​), ఆమె అత్తమామలు డబ్బుల కోసం మహిళను వేధించారని ఆరోపణలు వచ్చాయి. ఆ తర్వాత నరేశ్​పై ఐపీసీ సెక్షన్ 306 (ఆత్మహత్యకు ప్రేరేపణ) కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు పోలీసులు. ఈ క్రమంలో ట్రయల్ కోర్టు 1996లో నరేశ్​ను దోషిగా తేల్చింది. ఈ తీర్పుపై నరేశ్​ పంజాబ్​, హరియాణా హైకోర్టును ఆశ్రయించగా అక్కడ చుక్కెదురైంది. ట్రయల్ కోర్టు తీర్పును హైకోర్టు సమర్థించింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ 2008లో సుప్రీంకోర్టును ఆశ్రయించగా తాజాగా అతడి నిర్దోషిగా ప్రకటించింది. ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును, శిక్షను రద్దు చేసింది. నరేశ్ కుమార్​ను నిర్దోషిగా ప్రకటించింది.

తన భార్యను ఆత్మహత్యకు ప్రేరేపించానని దిగువ కోర్టులు నిర్ధరించి తనను దోషిగా తేల్చాయని నరేశ్ సుప్రీం ధర్మాసనానికి తెలిపాడు. తన భార్యను శారీరకంగా లేదా మానసికంగా వేధింపులకు గురిచేశానని అనడానికి ఒక్క సాక్ష్యం కూడా లేదని ధర్మాసనం ఎదుట చెప్పాడు.

"పిటిషన్​దారుడు తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకునే కేసు 1993లో మొదలై 2024లో ముగిసింది. అంటే దాదాపు 30 ఏళ్లు అతడు బాధపడ్డాడు. అంతేకాకుండా ఆర్నెళ్ల చిన్నారిని వదిలి మహిళ ఆత్మహత్య చేసుకుంది. ఈ రెండు కోణాల్లోనూ ఆలోచించి తీర్పు ఇచ్చాం. మహిళ ఆత్మహత్య చేసుకోవడానికి దారితీసిన ప్రత్యక్ష, పరోక్ష కారణాలు అవసరం. వివాహిత ఆత్మహత్యకు వేధింపులే కారణమని ఊహించకూడదు."
-- సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం

'పతంజలి మందులపై ఇక ప్రచారమొద్దు- మీ వల్ల దేశమంతా మోసపోయింది'

లోక్​పాల్ ఛైర్​పర్సన్​గా జస్టిస్ అజయ్ మానిక్​రావ్ ఖాన్విల్కర్​

Last Updated : Feb 29, 2024, 8:39 AM IST

ABOUT THE AUTHOR

...view details