తెలంగాణ

telangana

ETV Bharat / bharat

కోర్ట్ ఆదేశాలు ధిక్కరించినా, భర్తతో కలిసి ఉండకపోయినా - భార్య భరణానికి అర్హురాలే: సుప్రీం కోర్ట్​ - SC WIFE MAINTENANCE

భర్తతో కలిసి ఉండాలన్న ఆదేశాలను ధిక్కరించినా భరణానికి భార్య అర్హురాలే - సుప్రీం కోర్ట్​ తీర్పు

Supreme Court
Supreme Court (ANI)

By ETV Bharat Telugu Team

Published : Jan 12, 2025, 6:50 AM IST

SC Wife Maintenance :భర్తతో కాపురం చేయాలన్న కోర్టు ఆదేశాలను భార్య ధిక్కరించినప్పటికీ, ఆమె భరణాన్ని పొందటానికి అర్హురాలేనని సుప్రీం కోర్టు కీలక తీర్పును వెలువరించింది. అయితే, కోర్టు ఆదేశాల ఉల్లంఘనకు సహేతుకమైన కారణాలు ఉండాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ సంజయ్‌ కుమార్‌ ద్విసభ్య ధర్మాసనం పేర్కొంది. దాంపత్య హక్కును భర్తకు పునరుద్ధరిస్తూ న్యాయస్థానం ఉత్తర్వు జారీచేసిన తర్వాత కూడా భార్య అత్తగారింటికి తిరిగి రాకపోతే, మనోవర్తిని కోరే హక్కును ఆమె కోల్పోతారని పలు హైకోర్టులు తీర్పునిచ్చిన విషయాన్ని ధర్మాసనం ప్రస్తావించింది. నేర శిక్షాస్మృతిలోని సెక్షన్‌ 125(4) ప్రకారం అటువంటి తీర్పులు సమంజసమేనని స్పష్టం చేసింది. కలిసి జీవించాలన్న కోర్టు ఆదేశాలను సహేతుకమైన, ప్రత్యేకమైన పరిస్థితుల్లో భార్య తిరస్కరించినప్పటికీ ఆమె మనోవర్తి హక్కుకు నేరశిక్షా స్మృతిలోని సెక్షన్‌ 125 భద్రత కల్పిస్తోందని సుప్రీం కోర్ట్​ తన తీర్పులో వివరించింది. ఝార్ఖండ్‌కు చెందిన దంపతులకు సంబంధించిన కేసులో ఈ మేరకు తీర్పు ఇచ్చింది.

ఝార్ఖండ్​కు చెందిన ఓ మహిళ, అత్తవారింటిలో తనకు ఎదురవుతున్న ఇబ్బందులను ఏకరవుపెడుతూ కుటుంబ న్యాయస్థానానికి లేఖ రాసి భరణం చెల్లించాల్సిందిగా విజ్ఞప్తి చేసింది. ప్రతి నెలా ఆమెకు రూ.10,000 ఇవ్వాలన్న న్యాయస్థానం ఆదేశాలను భర్త హైకోర్టులో సవాల్‌ చేయగా అతనికి అనుకూలమైన తీర్పు వచ్చింది. దీంతో భార్య సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేసింది. దీనిని విచారించిన అత్యున్నత న్యాయస్థానం ఈ కీలక తీర్పు వెలువరించింది.

ABOUT THE AUTHOR

...view details