Jammu And Kashmir President Rule :జమ్ముకశ్మీర్‌లో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ), కాంగ్రెస్ కూటమి సిద్ధమైంది. ఈ మేరకు గరవర్నర్కు ఓ లేఖను సమర్పించారు ఎన్సీ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా. అయితే ప్రభుత్వ ఏర్పాటు కంటే ముందుగానే జమ్ముకశ్మీర్‌లో విధించిన రాష్టపతి పాలనను ఎత్తివేయాల్సిన అవసరం ఉందని నిపుణులు అంటున్నారు. అసలు రాష్ట్రపతి పాలనను ఎప్పుడు విధించారు? ప్రస్తుతం ఎందుకు ఎత్తేయాలో తెలుసుకుందాం.
రాష్ట్రపతి పాలన ఎందుకు విధించారు?
జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేకహోదా రద్దు చేయక ముందు బీజేపీ, పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ కూటమిగా ఏర్పడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. అయితే రాజకీయ కారణాల వల్ల 2018లో కూటమి నుంచి బీజేపీ వైదొలగింది. దీంతో ప్రభుత్వం పతనం కావడం వల్ల శాసన సభను రద్దు చేస్తూ ఆరు నెలల పాటు గవర్నర్ పాలను విధించారు. ఆ కాలం ముగియడం వల్ల కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి పాలనను విధించింది. ఆ తర్వాత 2019లో జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక హోదాను కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ కేంద్రం రాజ్యాంగ సవరణ చేపట్టింది. జమ్ముకశ్మీర్ రాష్ట్రాన్ని జమ్ముకశ్మీర్, లద్దాఖ్ కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించింది. ఈ సమయంలో అక్కడ జరిగిన పరిణామాల, భద్రతాపరమైన కారణాలవల్ల 2019 సార్వత్రిక ఎన్నికలతో పాటు అక్కడ పోలింగ్ నిర్వహించేందుకు ఎన్నికల సంఘం వెనకడుగు వేసింది. దీంతో పార్లమెంట్ అనుమతితో రాష్ట్రపతి 2019 అక్టోబర్ 31న రాష్ట్రపాతి పాలనను పొడిగిస్తూ ఓ నోటిఫికేషన్‌ను జారీ చేశారు. అది ఇప్పటి వరకు కొనసాగుతోంది.