Why Does Toilet Flush Have Two Buttons :మారుతున్న కాలానికి అనుగుణంగా మనుషులు ఉపయోగించే వస్తువుల విషయంలో ఎన్నో మార్పులు వస్తున్నాయి. ఒకప్పుడు విదేశాల్లో మాత్రమే వాడే వెస్ట్రన్ టాయిలెట్లను.. ఇప్పుడు భారతదేశంలో కూడా విరివిగా ఉపయోగిస్తున్నారు. ఇళ్లు, ఆఫీస్‌లు, పబ్లిక్ టాయిలెట్ల వంటి చాలా చోట్ల ఇప్పుడు వెస్ట్రన్ టాయిలెట్లు కనిపిస్తున్నాయి. ఇంకా కొత్తగా ఇంటిని నిర్మించుకునే వారు దాదాపుగా ఈ టాయిలెట్లనే ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇది ఇలా ఉంటే.. చాలా మంది వాష్‌రూమ్‌కు వెళ్లినప్పుడు ఫ్లష్‌కు రెండు బటన్‌లు ఉండటాన్ని గమనించే ఉంటారు. అలాగే ఈ బటన్‌లు ఒకటి పెద్దగా, మరొకటి చిన్నగా ఉంటుంది. అయితే, మీరు ఎప్పుడైనా ఆలోచించారా ? ఇలా ఫ్లష్‌కు రెండు బటన్‌లు ఎందుకు ఉన్నాయని ? ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఫ్లష్‌కు రెండు బటన్‌లు ఉండటం వెనుక ఉన్న ఆసక్తికరమైన చరిత్ర :మొదట్లో టాయిలెట్ ఫ్లష్‌ను డిజైన్ చేసినప్పుడు దానికి ఒకే బటన్ ఉండేదట. ఈ బటన్‌ను ప్రెస్ చేసినప్పుడు చాలా ఎక్కువగా నీరు వృథా అయ్యేది. అయితే అమెరికాకు చెందిన పారిశ్రామిక డిజైనర్ విక్టర్ పాపనెక్ 1976వ సంవత్సరంలో తన "డిజైన్ ఫర్ ది రియల్ వరల్డ్" పుస్తకంలో మొట్టమొదట డ్యూయల్-ఫ్లష్ టాయిలెట్ ఆలోచనకు బీజం వేశారు. అయితే, 1980 సంవత్సరంలో నీటి వృథాను తగ్గించడానికి ఆస్ట్రేలియాలోని కరోమా ఇండస్ట్రీస్‌లోని ఇంజనీర్లు మొదటి సారి డ్యూయల్-ఫ్లష్ టాయిలెట్ డిజైన్‌ను అభివృద్ధి చేశారు. ఆ సమయంలో ఆస్ట్రేలియాలో నీటి కరువు ఉండటం వల్ల ఈ డ్యూయల్ ఫ్లష్ టాయిలెట్ చాలా ఉపయోగపడింది. 1992లో అమెరికాలో ఈ డ్యూయల్-ఫ్లష్ టాయిలెట్ తప్పనిసరైంది.
పెద్ద బటన్‌కు, చిన్న బటన్‌కు తేడా ఏంటీ ?మొట్టమొదట డబుల్ ఫ్లష్‌ను కనిపెట్టినప్పుడు పెద్ద బటన్‌ను ఒకసారి ఫ్లష్ చేస్తే సుమారు 11 లీటర్ల నీరు బయటకు వచ్చేలా డిజైన్ చేశారు. అలాగే చిన్న బటన్‌ను ఫ్లష్ చేసినప్పుడు 5.5 లీటర్లు నీరు బయటకు వచ్చేలా డిజైన్ చేశారు. దీని వల్ల కూడా నీరు ఎక్కువగా వేస్ట్ అవుతుండటంతో మరికొన్ని మార్పులు చేశారు. అయితే, ప్రస్తుతం మనం ఉపయోగించే దాదాపు అన్ని టాయిలట్స్ ప్లష్లలో.. పెద్ద బటన్‌ను ఒకసారి ఫ్లష్ చేస్తే 6-7 లీటర్‌ల నీరు రిలీజ్ అయ్యేలా, అదే చిన్న బటన్‌ను ఫ్లష్ చేస్తే.. 3-4 లీటర్‌ల నీరు బయటకు వచ్చేలా డిజైన్ చేశారు. మరి రెండు బటన్లు ఎందుకూ అంటే.. మలవిసర్జన చేసినప్పుడు పెద్ద బటన్‌ను ప్రెస్ చేసేలా, మూత్రవిసర్జన చేసినప్పుడు చిన్న బటన్‌ను ఫ్లష్ చేసే విధంగా డిజైన్ చేశారు. ఇలా అవసరాన్ని బట్టి రెండు ఫ్లష్‌లను వాడటం వల్ల ఒక వ్యక్తి సంవత్సరానికి దాదాపు 20వేల లీటర్ల నీటిని ఆదా చేయగలడట.