AAP Cases in Supreme Court :దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ గెలుపొందడం వల్ల గత ఆప్ ప్రభుత్వం దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అధికారాలపై సుప్రీంకోర్టులో వేసిన దావాలు ఏమవుతాయనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. దిల్లీలో పాలనాధికారుల నియామక అధికారాన్ని ప్రజా ప్రభుత్వానికి కాకుండా లెఫ్టినెంట్ గవర్నర్‌కు కట్టబెడుతూ 2023లో కేంద్రం చేసిన చట్టం, ప్రభుత్వ న్యాయవాదుల నియామకాన్ని ఎల్జీ చేతుల్లో పెట్టడం వరకు అనేక అంశాలపై ఆప్ సర్కారు దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది.
దిల్లీలో గ్రూపు-ఏ అధికారుల నియామకాలు, బదిలీలపై అధికారాన్ని లెఫ్టినెంట్ గవర్నర్‌కు ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టు దాఖలు చేసిన పిటిషన్ ఇంకా పెండింగ్లోనే ఉంది. దిల్లీ విద్యుత్తు నియంత్రణ కమిషన్ ఛైర్‌పర్సన్ నియామకం, ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులను శిక్షణ కోసం ఫిన్లాండ్‌కు పంపడం వంటి వాటిపైనా ఆమ్ ఆద్మీ పార్టీ పిటిషన్లు దాఖలు చేసింది. తాజాగా జరిగిన ఎన్నికల్లో ఆప్ సర్కార్ ఓడిపోయి, బీజేపీ గెలిచింది. దీంతో ఈ దావాలు ఏమవుతాయని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
పరిపాలన సేవలపై పిటిషన్
దిల్లీలో పరిపాలన సేవలపై నియంత్రణను ఎల్జీకి అప్పగిస్తూ కేంద్రం 2023లో ఓ చట్టాన్ని తీసుకొచ్చింది. ఈ చట్టం రాష్ట్ర పరిపాలనకు ఆటంకాలు సృష్టిస్తోందని ఆప్ సర్కార్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన దిల్లీ ప్రభుత్వానికి పాలనాధికారుల నియామకంపై నియంత్రణ ఉండాలని 2023 మేలో పేర్కొంది. ప్రస్తుతం దీనిపై విచారణ పెండింగ్‌లో ఉంది.
ఈ కేసులపై కూడా సుప్రీంను ఆశ్రయించిన ఆప్ ప్రభుత్వం
దిల్లీ విద్యుత్తు నియంత్రణ కమిషన్ ఛైర్‌పర్సన్ నియామకానికి సంబంధించిన అంశంపై కూడా ఆప్ సర్కార్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులను శిక్షణ కోసం ఫిన్లాండ్‌కు పంపేందుకు ఎల్జీ అనుమతి, రిడ్జ్ ప్రాంతంలో అక్రమంగా చెట్ల నరికివేతపై దిల్లీ డెవలప్మెంట్ అథారిటీ ధిక్కార చర్యలపై దేశ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది.