Wayanad Landslides Death Toll :కేరళలో భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతి చెందినవారి సంఖ్య 294కు చేరింది. మండక్కై, చూరాల్‌మల, అత్తమాల, నూల్పుజ ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగున్నాయి. సైన్యం, నేవీ, NDRF, ఇతర సహాయ బృందాలు రెస్క్యూ ఆపరేషన్‌లో నిమగ్నమయ్యాయి. ఇప్పటివరకు వందలాది మందిని కాపాడి సురక్షిత శిబిరాలకు తరలించారు. వర్షాల కారణంగా ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఉన్నప్పటికీ వరసగా మూడో రోజు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. బురదలో కూరుకుపోయిన బాధితులను గుర్తించేందుకు ఆర్మీ జాగిలాలతో అన్వేషిస్తున్నారు. కొండచరియలు విరిగిపడిన ఘటనలో 200మందికి పైగా మృతిచెందారని NDRF డీఐజీ మొహసేన్ షాహిదీ తెలిపారు. 234మంది గాయపడి వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని చెప్పారు. దాదాపు 200 మంది ఆచూకీ తెలియాల్సి ఉందన్నారు.
కొండచరియలు విరిగిపడిన ఘటనలో సురక్షితంగా బయటపడ్డ కొందరు ప్రజలు ఆ భయానక అనుభవాన్ని పంచుకున్నారు. సోమవారం అర్థరాత్రి ఒకటిన్నర గంటల సమయంలో పెద్ద శబ్దం వినిపించిందని బాధితులు తెలిపారు. కిటికీలోంచి చూడగా పెద్ద ఎత్తున నీరు తమ ఇళ్ల వైపు రావడం కనిపించిందని చెప్పారు. ప్రాణాలు కాపాడుకునేందుకు డాబాలపైకి వెళ్లామనీ అక్కడి నుంచి వేరే ప్రాంతానికి వెళ్లేందుకు గానీ మరొకరిని కాపాడేందుకు గానీ వీలు లేకుండా పోయిందని వివరించారు. సెల్‌ఫోన్లను వదిలి ఇళ్లపై కప్పుల పైకి వెళ్లడం వల్ల ఎవరికీ సమాచారం ఇవ్వలేకపోయామని చెప్పారు.
కొండచరియలు విరిగిపడిన చూరల్‌మలలో లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ పర్యటించారు. సహాయక చర్యలు జరుగుతున్న తీరును అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సమీపంలోని సహాయక శిబిరాలు, ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు.