Wayanad Landslide Death Toll :కేరళ వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటివరకు 123 మంది మరణించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. అనేక మంది గాయపడినట్లు రెవెన్యూ మంత్రి కార్యాలయం ప్రకటించింది. సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు వివరించారు ప్రధాన కార్యదర్శి వీ వేణు.
ఘటనా స్థలంలో కేరళ రాష్ట్ర విపత్తు స్పందన దళం-KSDMA, అగ్నిమాపక బృందం, జాతీయ విపత్తు స్పందన దళం-NDRF బృందాలు, నేవీ కలిసి రెస్క్యూ ఆపరేషన్‌ను కొనసాగిసున్నాయి. తాళ్ల సాయంతో వరదల్లో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి. భారీ వర్షాలు కురుస్తుండటం వల్ల సహాయక చర్యలకు అంతరాయం కలుగుతోంది. కొండచరియల కింద చాలా మంది ప్రజలు చిక్కుకుపోయి ఉంటారని స్థానికులు భయాందోళన వ్యక్తం చేశారు.
మృతదేహాలు వెతుకుతూ బంధువుల రోదనలు
మరోవైపు వయనాడ్ జిల్లా కేంద్రంలోని ఆస్పత్రిలో విషాదఛాయలు అలుముకున్నాయి. నేలపైనే మృతదేహాలను ఆస్పత్రిలో ఉంచడం వల్ల వారిని వెతుకుతూ బంధువులు చేస్తున్న రోదనలు మిన్నంటాయి. ఈ ప్రమాదం నేపథ్యంలో మంగళ, బుధవారాలను సంతాప దినాలుగా ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం. మరోవైపు బాధితులకు అందుతున్న వైద్య సేవలపై సమీక్షించారు రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జ్.
జాతీయ విపత్తుగా ప్రకటించాలని విపక్షం డిమాండ్
మరోవైపు వయనాడ్ ప్రమాదాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలని డిమాండ్ చేశాయి విపక్షాలు. బాధిత కుటంబాలకు సత్వరం సాయం అందజేయాలని లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ డిమాండ్ చేశారు. వీలైతే పరిహారాన్ని మరింత పెంచాలని కోరారు. క్షతగాత్రులకు అవసరమైన వైద్య సాయాన్ని అందించాలని లోక్‌సభలో రాహుల్ పేర్కొన్నారు. వయనాడ్‌లో పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు.
"ఈ తెల్లవారుజామున వయనాడ్‌లో విధ్వంసకర కొండచరియలు విరిగిపడ్డాయి. 70 మందికి పైగా చనిపోయారు. ముండకై గ్రామంతో సంబంధాలు తెగిపోయాయి. విషాదం జరిగిన తీరు కారణంగా ప్రాణనష్టాన్ని ఇంకా అంచనా వేయలేదు. నేను రక్షణ మంత్రి, కేరళ ముఖ్యమంత్రితో మాట్లాడాను. రెస్క్యూ , వైద్య సాయం కోసం సాధ్యమైన అన్ని విధానాల్లో సహాయం అందించాలని కోరాను. మృతుల కుటుంబాలకు పరిహారం వెంటనే విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నాను. ఆ పరిహారాన్ని కూడా పెంచగలిగేలా చూడాలని కోరాను. కీలకమైన రవాణా, కమ్యూనికేషన్ మార్గాలను పునరుద్ధరించండి. వీలైనంత త్వరగా బాధిత కుటుంబాల పునరావాసం కోసం రోడ్‌మ్యాప్ సిద్ధం చేయండి."