Vinayaka Chavithi Celebrations : దేశవ్యాప్తంగా వినాయక చవితి వేడుకలు ఆనందోత్సవాల మధ్య మొదలయ్యాయి. ముంబయి లాల్‌బాగ్‌లోని లాల్‌బగీచా ఆలయం సందడిగా మారింది. ఉదయం నుంచే ప్రముఖులతోపాటు ప్రజల రాక మొదలైంది. లాల్‌బాగ్ వినాయకుడికి అనంత్ అంబానీ 20-కేజీల బంగారు కిరీటాన్ని సమర్పించారు. ఈ కిరీటం విలువ సుమారు రూ.15 కోట్లు ఉంటుందని లాల్‌బాగ్ ఆలయ వర్గాలు తెలిపాయి. మరోవైపు, శివసేన-యూబీటీ వర్గం అధినేత ఉద్ధవ్ ఠాక్రే సతీసమేతంగా వచ్చి ఏకదంతుడిని దర్శించుకున్నారు. హారతి సమర్పించి, ఆశీస్సులు పొందారు. బాలీవుడ్ నటుడు కార్తిక్ ఆర్యన్‌తోపాటు వివిధ రంగాల ప్రముఖులు లాల్‌బాగ్ గణనాథుడిని దర్శించుకున్నారు.
ఏక్‌నాథ్ శిందే :మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ శిందే తన నివాసంలో ఏకదంతుని విగ్రహాన్ని ఏర్పాటు చేసి పూజలు చేశారు. వివిధ రకాల నైవేద్యాలు, కర్పూర హారతి సమర్పించారు. ఈ వేడుకల్లో సీఎం కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
ప్రమోద్ సావంత్ : గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ తన నివాసంలో గణపతిమూర్తిని ఏర్పాటు చేసి పూజలు నిర్వహించారు. సీఎం సతీమణితోపాటు ఇతర కుటుంబ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
రాజ్‌ఠాక్రే : ఎంఎన్‌ఎస్ అధినేత రాజ్‌ఠాక్రే నివాసంలో వినాయక చవితి వేడుకలు జరిగాయి. కనకం, రజతం రంగుల్లో బుజ్జి గణపతి విగ్రహాన్ని ఏర్పాటు చేసి వివిధ రకాల పూలతో అందంగా అలంకరించారు.
సోనూసూద్ : ప్రముఖ నటుడు సోనుసూద్ నివాసంలోనూ గణేశ్ నవరాత్రి వేడుకలు జరిగాయి. ముంబయిలోని తన నివాసంలో ఆయన అందంగా ముస్తాబు చేసిన మండపంలో శ్వేతవర్ణంలో ఉన్న లంబోదరుడి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. కుటుంబ సభ్యులతో కలిసి పూజలు నిర్వహించిన సోనుసూద్ ఆ తర్వాత ఈ వేడుకలో పాల్గొనవారికి మిఠాయిలు పంచారు.