Villagers kill sixth wolf in Bahraich :ఉత్తర్ప్రదేశ్ బహ్రాయిచ్ జిల్లాలోని మహ్సీ తహసీల్ ప్రజలకు దాదాపు రెండు నెలలుగా కంటిమీద కునుకులేకుండా చేస్తున్న తోడేళ్ల బెడద ఎట్టకేలకు తీరింది! ఈ 'కిల్లర్' గ్రూపులోని ఆరో తోడేలును తమచ్పుర్ గ్రామస్థులు చంపినట్లు పోలీసులు వెల్లడించారు. రామ్గావ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆడ తోడేలును శనివారం అర్ధరాత్రి గ్రామస్థులు చంపారని తెలిపారు. తోడేలు మృతదేహంపై గాయాలు ఉన్నాయని, రక్తస్రావం అయినట్లు గుర్తించామని చెప్పారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించినట్లు తెలిపారు. ఈ తోడేలు జనావాస ప్రాంతంలోకి వచ్చి మేకలను తీసుకెళ్లిందని స్థానికులు ద్వారా తెలుసుకున్నామని డీఎఫ్ఓ అజిత్ ప్రతాప్ సింగ్ పేర్కొన్నారు. చనిపోయిన తోడేలు కుంటిదా అని ఇడగ్గా, నరభక్షక తోడేళ్ల గుంపులో కుంటి తోడేలు అసలు లేదన్నారు.
మరోవైపు, తమ గ్రామంలోని ఓ ఇంటి ఆవరణలో తల్లి పక్కన నిద్రిస్తున్న చిన్నారిపై తోడేలు దాడి చేసేందుకు ప్రయత్నించిందని తమచ్పుర్ గ్రామస్థులు తెలిపారు. అయితే తల్లి అరుపులకు భయపడి అక్కడే ఉన్న మేకపై దాడి చేసిందని చెప్పారు. దీంతో ఆ తోడేలును చుట్టుముట్టి చంపేశామని వెల్లడించారు.
గత రెండు నెలలుగా ఆరు కిల్లర్ తోడేళ్లు మాహ్సీ తహసీల్ ప్రాంతంలోని ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. వీటి దాడిలో ఇప్పటివరకు 7 చిన్నారులు సహా 9 మంది మృతి చెందారు. దాదాపు 40 మంది గాయపడ్డారు. ఈ క్రమంలో తోడేళ్లను పట్టుకోవడానికి ఉత్తర్ప్రదేశ్ ప్రభుత్వం ఆపరేషన్ భేడియాను ప్రారంభించింది. అటవీ శాఖ సెప్టెంబర్ 10న ఐదో తోడేలును పట్టుకుంది. అనంతరం ఆరో తోడేలు కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. స్థానికులు తెలిపివ వివరాల ఆధారంగా దాన్ని పట్టుకోవడం కోసం స్నాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు. చివరకు ఆఖరి తోడేలు ఇలా తమచ్పుర్ గ్రామస్థుల చేతిలో చనిపోయింది.