తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'కొవిడ్ మరణాలపై ఆ లెక్క తప్పు- వాళ్లు మృతిచెందింది కరోనాతో కాదు' - Covid Death Report - COVID DEATH REPORT

Covid Death Report : భారత్‌లో 2020 కొవిడ్‌ మరణాలపై వెలువడిన ఓ అధ్యయనం పూర్తిగా తప్పుదోవ పట్టించేలా ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. భారత్‌లో కొవిడ్‌ మరణాలు నివేదించిన వాటి కంటే అత్యధికంగా ఉన్నాయంటూ అంతర్జాతీయ సంస్థ సైన్స్‌ అడ్వాన్సెస్‌ ప్రచురించిన జర్నల్‌ను తోసిపుచ్చింది. ఆ అధ్యయనం చేసిన అంచనాలు తప్పుదోవ పట్టించేవిగా ఉన్నాయని మండిపడింది. లోపభూయిష్టమైన పద్ధతిలో వారు చేసిన అధ్యయనం ఆమోదయోగ్యం కాదని కొట్టిపారేసింది.

Covid Death Report
Covid Death Report (Source: ANI)

By ETV Bharat Telugu Team

Published : Jul 20, 2024, 7:38 PM IST

Covid Death Report :భారత్‌తోపాటు యావత్‌ ప్రపంచాన్ని వణికించింది కొవిడ్‌. ఈ మహమ్మారి కారణంగా ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు. భారత్‌లో దాదాపు 5లక్షల మందికిపైగా మృతిచెందారు. అయితే, కొవిడ్‌ సమయంలో భారత్‌లో రిపోర్ట్‌ చేసిన సంఖ్య కంటే ఎక్కువ మరణాలు సంభవించినట్లు సైన్స్‌ అడ్వాన్సెస్‌ జర్నల్‌ ఓ అధ్యయనం ప్రచురించింది. ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీసహా పలు విశ్వవిద్యాలయాలకు చెందిన పరిశోధకులు ఈ అధ్యయనంలో పాల్గొన్నారు.

2020లో కొవిడ్‌తో 11.9 లక్షల మంది మరణించినట్లు అధ్యయనం తెలిపింది. ఇది భారత్‌ అధికారికంగా ప్రకటించిన మరణాల సంఖ్య కంటే 8 రెట్లు ఎక్కువని పేర్కొంది. ప్రపంచ ఆరోగ్యసంస్థ- WHO లెక్కల కంటే 1.5 రెట్లు అధికమని నివేదించింది. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే NFHS-5 నివేదికను విశ్లేషించినట్లు పేర్కొన్న అధ్యయనకర్తలు, కరోనా సమయంలో భారత్‌లో ఎక్కువ మంది చనిపోయినట్లు పేర్కొన్నారు. 7.65లక్షల మందిపై అధ్యయనం చేసినట్లు చెప్పారు. కొవిడ్‌ తర్వాత మహిళల ఆయురార్ధం 3.1ఏళ్లు పురుషుల్లో 2.1ఏళ్లు తగ్గినట్లు సైన్స్‌ అడ్వాన్సెస్‌ జర్నల్‌ పేర్కొంది.

2020లో కొవిడ్‌ సమయంలో మరణాలపై సైన్స్‌ అడ్వాన్సెస్‌ జర్నల్‌ ప్రచురించిన అధ్యయనం ఏమాత్రం ఆమోదయోగ్యంగాలేదని, తప్పుదోవ పట్టించేలా ఉందని కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది. కొన్ని మీడియాల్లో ఈ అధ్యయనం ప్రచురితంకావడం వల్ల ఈ మేరకు స్పందించింది. జాతీయకుటుంబ ఆరోగ్య సర్వే- NHFS- 5ని ప్రామాణిక పద్ధతిలో విశ్లేషించినట్లు అధ్యయనకర్తలు పేర్కొన్నప్పటికీ అందులో తీవ్రమైన లోపాలు ఉన్నాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. 2021 జనవరి, ఏప్రిల్‌ మధ్య N.F.H.S.సర్వేలో చేర్చిన కుటుంబాలను తీసుకొని 2020లో ఆ కుటుంబాల్లో సంభవించిన మరణాలను 2019తో పోల్చారని చెప్పింది. వాటిని దేశం మొత్తానికి ఆపాదించటం సర్వేలో జరిగిన అతిపెద్ద తప్పిదమని వెల్లడించింది. NFHS మొత్తం నమూనాలను తీసుకున్నప్పుడే దేశం మొత్తంగా పరిగణించాలని తెలిపింది.

కేవలం 14 రాష్ట్రాల్లోని 23శాతం కుటుంబాలను విశ్లేషించి దాన్ని దేశం మొత్తంగా పరిగణించరాదని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ పేర్కొంది. దేశంలోని పౌరనమోదు వ్యవస్థ- CSR అత్యంత విశ్వసనీయమైనందని తెలిపింది. దేశంలోని 99 శాతం మరణాలు నమోదవుతాయని పేర్కొంది. CSRప్రకారం 2019తో పోలిస్తే 2020లో మరణాలు 4.74లక్షలు పెరిగాయని కేంద్ర ఆరోగ్య శాఖ చెప్పింది. అంతకుముందు 2018లో 4.86 లక్షలు, 2019లో 6.90లక్షల మరణాలు నమోదయ్యాయి. అధికంగా నమోదైన మరణాలకు కొవిడ్‌ అని చెప్పలేమని, ఇతరత్రా ఆరోగ్యసమస్యలూ కారణం కావచ్చని కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది.

కొవిడ్ సోకిన చిన్న పిల్లల్లో టైప్-1 షుగర్​ లక్షణాలు! - COVID 19 Type 1 Diabetes

ఆస్ట్రాజెనెకా సంచలన నిర్ణయం- మార్కెట్​ నుంచి కొవిడ్ 'వ్యాక్సిన్' ఉపసంహరణ- కారణమిదే! - AstraZeneca Withdraws Covid Vaccine

ABOUT THE AUTHOR

...view details