Saif Ali Khan Attack Twist : బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌పై దాడి కేసులో ఊహించని ట్విస్ట్ బయటపడినట్లు వార్తలు వెలువడుతున్నాయి. ఈ కేసు దర్యాప్తు చేస్తున్న బాంద్రా పోలీసులు సైఫ్‌పై దాడికి పాలపడిన నిందితుడు షరీఫుల్ ఇస్లాం వేలిముద్రలను సేకరించారు. అయితే దాడి జరిగిన ప్రదేశంలో లభించిన ఫింగర్ ప్రింట్స్ - నిందితుడితో సరిపోలడం లేదని పోలీసులు
గుర్తించినట్లు కథనాలు వెలువడుతున్నాయి.
ముంబయిలో ఈనెల 16వ తేదీ తెల్లవారుజామున బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ నివాసంలోకి చొరబడిన దుండగుడు, ఆయనపై దాడిచేసిన కేసు అనేక మలుపులు తిరుగుతోంది. విచారణలో భాగంగా నటుడి ఇంటిని పరిశీలించిన మహారాష్ట్ర సీఐడీ విభాగంలోని క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ బృందం అక్కడ ఉన్న దాదాపు 19 వేలిముద్రలను సేకరించింది. వాటిల్లో ఏవీ నిందితుడి ఫింగర్ ప్రింట్స్‌తో మ్యాచ్ కావడం లేదని పోలీసులకు ఫోరెన్సిక్ బృందం వెల్లడించినట్లు తెలుస్తోంది. తదుపరి పరీక్షల కోసం మరోసారి ఘటనా స్థలం నుంచి మరిన్ని వేలిముద్రల నమూనాల్ని సేకరించాలని పోలీసులు భావిస్తున్నారు.
మరోవైపు కేసు విచారణ కోసం ముంబయి పోలీసులు సైఫ్ రక్త నమూనాలను, దాడి జరిగిన రోజు ఆయన ధరించిన దుస్తులను సేకరించారు. వీటిని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. ఈ కేసులో నిందితుడైన షరీఫుల్ ఇస్లాం దొంగతనం చేయాలనే ఉద్దేశంతోనే ఆ ఇంట్లోకి ప్రవేశించాడని, అయితే తరువాత పరిస్థితి తీవ్ర ఘర్షణకు దారితీసిందని ప్రాథమిక విచారణలో తేలింది. అందుకే దాడి సమయంలో సైఫ్ ధరించిన దుస్తులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడి దుస్తులపై రక్తపు మరకలు కనిపించడం వల్ల అవి సైఫ్ అలీఖాన్‌వేనా, కాదా అని నిర్ధరించడం కోసం నమూనాలు సేకరించారు. దుండగుడి దుస్తులను, సైఫ్ రక్తనమూనాలను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపినట్లు అధికారులు తెలిపారు.
నిందితుడి దాడిలో సైఫ్ అలీఖాన్ వెన్నెముక, చెయ్యి సహా పలుచోట్ల గాయాలయ్యాయి. ఐదు రోజులపాటు ముంబయిలోని లీలావతి ఆసుపత్రిలో చికిత్స పొందిన ఆయనకు కత్తి గాట్లు పడిన చోట శస్త్రచికిత్స కూడా చేశారు. ఒకటి రెండుచోట్ల ప్లాస్టిక్ సర్జరీ సైతం నిర్వహించారు. ఈనెల 21న ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన సైఫ్ అలీఖాన్ ప్రస్తుతం కోలుకుంటున్నారు.