తెలంగాణ

telangana

ETV Bharat / bharat

పేదల కోసం మరో 3 కోట్ల ఇళ్లు- 25 వేల గ్రామాలకు రోడ్లు - Union Budget 2024 - UNION BUDGET 2024

Union Budget 2024 Infrastructure : దేశంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి 11 లక్షల కోట్ల రూపాయలను కేటాయిస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ ప్రసంగంలో ప్రకటించారు. గ్రామీణ అభివృద్ధి కోసం 2 లక్షల 66 వేల కోట్ల రూపాయలను కేటాయించారు. పీఎం ఆవాస్‌ యోజన కింద గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో అదనంగా మూడు కోట్ల ఇళ్లను నిర్మించనున్నారు.

Union Budget 2024
Nirmala Seetaraman (ANI)

By ETV Bharat Telugu Team

Published : Jul 23, 2024, 2:23 PM IST

Union Budget 2024 Infrastructure :రానున్న ఐదేళ్లలో దేశంలో మౌలిక వసతుల కల్పనకు భారీగా కేటాయింపులు జరుపుతున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. ఈ ఏడాది మౌలిక సదుపాయాల అభివృద్ధికి 11 లక్షల కోట్ల రూపాయలను కేటాయిస్తున్నట్లు తెలిపారు. గ్రామీణ అభివృద్ధి కోసం 2 లక్షల 66 వేల కోట్ల రూపాయలను కేటాయించారు. ఈ నిధులతో గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి కూడా చేపడతారు. పీఎం ఆవాస్‌ యోజన కింద గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో అదనంగా మూడు కోట్ల ఇళ్లను నిర్మించనున్నారు. అర్బన్‌ హౌసింగ్‌ కోసం ఐదేళ్లలో 2.2 లక్షల కోట్ల రూపాయలను ఖర్చు చేయనున్నారు.

25వేల గ్రామాలకు అన్ని కాలాల్లోనూ!
ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన-అర్బన్‌ కింద కోటి మంది పట్టణ పేద, మధ్యతరగతి కుటుంబాల ఇది లబ్ధి చేకూర్చనుంది. గృహరుణాలకు వడ్డీ రాయితీ అందించనున్నారు. ప్రధాన మంత్రి గ్రామ్‌ సడక్‌ యోజన నాలుగో దశ కింద 25 వేల గ్రామాలకు అన్ని కాలాల్లోనూ చేరుకునేలా కనెక్టివిటీని కల్పిస్తారు. పారిశ్రామిక ప్రాంతాల్లో పనిచేసే కార్మికుల కోసం అద్దె గృహాల నిర్మాణం, పీపీపీ విధానంలో డార్మిటరీ తరహా ఇళ్ల నిర్మాణం చేపట్టనున్నారు. రాష్ట్రాల మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల కోసం 1.5 లక్షల కోట్లతో దీర్ఘకాల వడ్డీ రహిత రుణాలు అందజేయనున్నారు. ఎంపిక చేసిన నగరాల్లో స్ట్రీట్‌ ఫుడ్‌ హబ్‌ల ఏర్పాటు చేయనున్నారు.

"రానున్న ఐదేళ్లలో దేశంలో మౌలిక వసతుల కల్పనకు మేం భారీగా కేటాయింపులు జరుపుతున్నాం. మూలధన వ్యయం కోసం ఈ ఏడాది 11.11 లక్షల కోట్ల రూపాయలను కేటాయించాం. ఇది దేశ జీడీపీలో 3.4 శాతం. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇదే స్థాయిలో మౌలిక వసతుల కల్పనకు కేటాయింపులు జరపాలని మేం ప్రోత్సహిస్తున్నాము. వయబిలిటీ గ్యాప్ ఫండింగ్, విధానాలు, నిబంధనలు సరళతరం చేయడం ద్వారా మౌలిక సదుపాయాలపై ప్రైవేట్ పెట్టుబడులను ప్రోత్సహిస్తాం."

-నిర్మలా సీతారామన్‌, కేంద్ర ఆర్థిక మంత్రి

కోటి 28 లక్షల మంది రిజిస్టర్‌!
మధ్యంతర బడ్జెట్‌లో ప్రకటించినట్లు కోటి ఇళ్లకు పీఎం సూర్యఘర్‌ ముఫ్త్‌ బిజిలీ యోజన కింద నెలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ అందించనున్నట్లు నిర్మలా సీతారామన్‌ తెలిపారు. ఈ పథకానికి అద్భుత స్పందన వచ్చిందని కోటి 28 లక్షల మంది రిజిస్టర్‌ చేసుకున్నట్లు తెలిపారు. భారత నాగరికతలో భాగమైన పర్యటకానికి ప్రోత్సహం ఇస్తున్నట్లు నిర్మలా సీతారామన్‌ వెల్లడించారు.

కాశీ విశ్వనాథ్‌ టెంపుల్‌ కారిడార్‌ను మరింతగా!
బిహార్‌లో గయాలో విష్ణుపాద్‌ దేవాలయ కారిడార్​తోపాటు బోధ్‌గయలో మహాభోది దేవాలయ కారిడార్‌ను అభివృద్ధి చేయనున్నట్లు వెల్లడించారు. నలందను పర్యటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామన్నారు. విదేశీ పర్యటకులను ఆకర్షించేందుకు కాశీ విశ్వనాథ్‌ టెంపుల్‌ కారిడార్‌ను మరింత అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. ఒడిశాలో కూడా పర్యటక ప్రాంతాలను అభివృద్ధి చేయనున్నట్లు నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. 100 నగరాల్లో నీటి సరఫరా, మురుగునీటి శుద్ధి, ఘన వ్యర్థ పదార్థాల నిర్వహణ ప్రాజెక్టులకు రాష్ట్రాలు, అభివృద్ధి బ్యాంకులతో కలిసి కేంద్రం ప్రోత్సాహం అందించనుంది.

కొత్తగా ఉద్యోగంలో చేరితే నెల జీతం బోనస్- ఐదేళ్లలో 4.1 కోట్ల మందికి ఉపాధి! - Union Budget 2024

అర్బన్ హౌసింగ్​కు రూ.2.2లక్షల కోట్ల ప్యాకేజీ- మహిళలు కొనే ఆస్తులపై పన్ను తగ్గింపు - Union Budget 2024

ABOUT THE AUTHOR

...view details