Union Budget 2024 Railway: కేంద్రం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్లో ఈ సారి రైల్వే శాఖకు రూ.2.55 లక్షల కోట్లు కేటాయించారు. అలానే రైల్వేలపై కీలక ప్రకటనలు చేశారు. 40 వేల సాధారణ రైలు బోగీలను వందే భారత్ ప్రమాణాలతో మార్పు చేస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. మూడు కొత్త రైల్వే ఆర్థిక కారిడార్లను ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. రైలు మార్గాల్లో హైట్రాఫిక్, హైడెన్సిటీ కారిడార్లలో నూతన మౌలిక సదుపాయాలు మెరుగుపర్చనున్నట్లు ఆర్థిక మంత్రి తెలిపారు.
ప్రయాణీకుల సౌలభ్యం, భద్రతను పెంచటం కోసం 40 వేల సాధారణ రైలు బోగీలను వందే భారత్ ప్రమాణాలతో మార్పు చేస్తామని ఆర్థిక మంత్రి తెలిపారు. అలానే మూడు కొత్త కారిడార్లను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఇంధనం- మినరల్- సిమెంట్, పోర్ట్ కనెక్టివిటీ, హై ట్రాఫిక్ డెన్సిటీ ఇలా మూడు ఆర్థిక కారిడార్లను పీఎం గతిశక్తి కార్యక్రమం కింద అమలు చేయనున్నట్లు తెలిపారు. " హై ట్రాఫిక్ డెన్సిటీ కారిడార్ వల్ల ప్యాసింజర్ రైళ్ల కార్యకలాపాలు మెరుగుపరచడానికి సహాయపడుతుంది. దీని వల్ల ప్రయాణీకులకు భద్రత ఉంటుంది. ప్రయాణ వేగం కూడా పెరుగుతుంది. ఈ మూడు ఆర్థిక కారిడార్స్ వల్ల మన జీడీపీ వృద్ధిని వేగవంతం చేయటంలో ఉపయోగపడతాయి" అని నిర్మలా సీతారామన్ తెలిపారు.