Twenty20 Party In Kerala Polls : కేరళలో లోక్ సభ ఎన్నికల్లో సత్తా చాటేందుకు అధికార ఎల్డీఎఫ్, ప్రతిపక్ష యూడీఎఫ్ తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఈ రెండు పార్టీలు ఇండియా కూటమిలో భాగమైనా విడివిడిగానే పోటీ చేస్తున్నాయి. అలాగే ఎన్డీఏ సైతం కేరళలో మెరుగైన ఫలితాలు సాధించాలని ఆశపడుతోంది. ఈ క్రమంలో అకస్మాత్తుగా ట్వంటీ20 అనే పార్టీ కేరళ రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. ఎర్నాకులం, చాలకుడి నియోజకవర్గాల్లో తమ అభ్యర్థులను బరిలో దింపి సత్తా చాటేందుకు ప్రయత్నిస్తోంది. ఈ పార్టీ అభ్యర్థుల ప్రచారానికి పెద్ద ఎత్తున జనాలు రావడం వల్ల ప్రధాన పార్టీల్లో ఆందోళన కలిగిస్తోంది. ఓట్ల చీలిక వల్ల తమ పార్టీకి నష్టం వాటిల్లుతుందేమోనని ప్రధాన పార్టీలు భయపడుతున్నాయి.
ట్వంటీ20 పార్టీ తరఫున చలకుడి నుంచి చార్లీ పాల్ బరిలో ఉండగా, ఎర్నాకులం నుంచి ఆంటోని జూడీ పోటీ చేస్తున్నారు. ఈ నియోజకవర్గాల్లో ట్వంటీ20 పార్టీ ప్రచారంలో దూసుకెళ్తోంది. కాగా, ఈ పార్టీ సాధించిన ఓట్లే ఈ నియోజకవర్గాల్లో ప్రధాన పార్టీల అభ్యర్థుల గెలుపోటములు నిర్ణయించే అవకాశం ఉంది. ట్వంటీ20 పార్టీ విస్తృత ప్రచారంతో అధికార ఎల్డీఎఫ్, యూడీఎఫ్ శిబిరాల్లో ఆందోళన నెలకొంది.
క్రైస్తవులపై ఫోకస్
చాలకుడి నుంచి పోటీ చేస్తున్న చార్లీ పాల్‌కు ఆ నియోజకవర్గంలో ఓటర్లతో మంచి సంబంధాలు ఉన్నాయి. మద్యపాన వ్యతిరేక కమిటీ కార్యకర్తగా ఆయన పనిచేశారు. చాలకుడి నియోజకవర్గంలో చర్చిల ప్రభావం ఎక్కువ. ఈ నియోజకవర్గలో క్రైస్తవులతో సన్నిహిత సంబంధం ఉన్న అభ్యర్థిని నిలబెట్టడం, ఎక్కువ ఓట్లను రాబట్టేలా చేయటమే ట్వంటీ20 పార్టీ లక్ష్యం. చర్చిల ప్రభావం ఉన్న పెరుంబవూర్, కున్నతునాడ్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎక్కువ ఓట్లు రావడం కోసం ట్వంటీ20 పార్టీ ప్రణాళిక రచించింది. యూడీఎఫ్ అభ్యర్థి బెన్నీ బెహనాన్‌ను ఎలాగైనా ఓడించాలని చార్లీ పాల్ కష్టపడుతున్నారు. అందుకు కారణం కాంగ్రెస్, ట్వంటీ20 కార్యకర్తల మధ్య ఎన్నికల సమయంలో గొడవలు. ఈ క్రమంలో ఇరుపార్టీల నేతలపై కేసులు కూడా నమోదయ్యాయి.