TTD Darshan Tickets for October 2024: అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడిని మరింత ప్రీతిపాత్రంగా సేవించుకునేందుకు భక్తుల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం పలు ఆర్జిత సేవలను ప్రవేశపెట్టింది. అందుకు సంబంధించిన టికెట్లను మూడు నెలలు ముందుగానే ఆన్‌లైన్‌లో విడుదల చేస్తూ వస్తోంది. ఈ క్రమంలోనే.. అక్టోబర్ నెలకు సంబంధించిన ఆర్జిత సేవలు, దర్శనాలు, వసతి గదుల బుకింగ్‌కు సంబంధించిన షెడ్యూల్ రిలీజ్ చేసింది. మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం..
శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు : అక్టోబర్ నెలకు సంబంధించిన తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను జులై 18న ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్లు టీటీడీ ప్రకటించింది. అలాగే.. ఈ సేవా టికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం జులై 18వ తేదీ ఉదయం 10 నుంచి జులై 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని వెల్లడించింది. లక్కీ డిప్‌లో టికెట్లు పొందిన భక్తులు జులై 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటలలోపు నగదు చెల్లించి టికెట్లు ఖరారు చేసుకోవాలని తెలిపింది.
వర్చువల్ సేవ : అదే విధంగా కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్ సేవ, సహస్ర దీపాలంకరణ సేవా టికెట్ల కోటాను జులై 22వ తేదీ ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. అలాగే వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన టికెట్లను అదే రోజు(జులై 22) మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో రిలీజ్ చేయనున్నట్లు స్పష్టం చేశారు.
శ్రీవాణి టికెట్ల ఆన్లైన్ కోటా : అక్టోబర్ నెలకు సంబంధించిన అంగప్రదక్షిణం టికెట్లను ఈ నెల 23న ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో టీటీడీ అధికారులు విడుదల చేయనున్నారు. అలాగే.. శ్రీవాణి ట్రస్టు టికెట్ల బుకింగ్‌ను జులై 23న ఉదయం 11 గంటలకు అందుబాటులో ఉంటాయని తెలిపారు. అంతేకాకుండా.. వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్న వారు స్వామిని దర్శించుకునేందుకు వీలుగా ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను అదే రోజు(జులై 23).. మధ్యాహ్నం 3 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్లు అధికారులు తెలిపారు.
తిరుమలపై జరుగుతున్న ఆ ప్రచారం అబద్ధం - భక్తులు అలా చేయొద్దు - స్పందించిన టీటీడీ