కశ్మీర్ టు పంజాబ్- డ్రైవర్ లేకుండా 78కి.మీ దూసుకెళ్లిన రైలు- టెన్షన్ టెన్షన్! Train Run Without Driver :లోకో పైలట్ లేకుండా ఓ గూడ్స్ రైలు 78 కిలోమీటర్లకుపైగా ప్రయాణించి కలకలం రేపింది. జమ్ముకశ్మీర్‌లోని కథువా స్టేషన్‌లో నిలిపిన ఓ సరకు రవాణా రైలు పంజాబ్ వైపునకు వెళ్లిపోయింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న అధికారులు పలు స్టేషన్లలో రైలును అపేందుకు విఫలయత్నం చేశారు. చివరకు పంజాబ్ హోషియాపుర్ జిల్లా ముకేరియన్లోని ఉచ్చి బస్సీ సమీపంలో రైలును నిలిపివేశారు. ఈ ఘటన రైల్వే శాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్ దృష్టికి వెళ్లగా, ఆయన విచారణకు ఆదేశించారు.
కారణం అదే!
53 వ్యాగన్ల చిప్స్టోన్స్ లోడ్‌తో జమ్ముకశ్మీర్ నుంచి పంజాబ్ బయలుదేరిన గూడ్స్ రైలు (14806R) జమ్ములోని కథువా రైల్వేస్టేషన్లో ఆగింది. అయితే లోకోపైలట్, అసిస్టెంట్ లోకోపైలట్ హ్యాండ్‌బ్రేక్ వేయకుండానే బయటకు వెళ్లిపోయారు. దీంతో పఠాన్‌కోట్ వైపు రైల్వే ట్రాక్ వాలుగా ఉండటం వల్ల రైలు ముందుకు కదిలింది. క్రమంగా గంటకు 80 కిలో మీటర్ల వేగం అందుకుంది. ఈ ఘటన ఆదివారం ఉదయం 7.25 నుంచి 9 గంటల మధ్య జరిగినట్లు తెలుస్తోంది. అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎవరికీ ఏం కాలేదు.
ట్రైన్‌ను ఆపేందుకు విఫలయత్నం
లోకోపైలట్ లేకుండా ట్రైన్ దూసుకెళ్లడంపై సమాచారం అందుకున్న అధికారులు అప్రమత్తమయ్యారు. రైలును పఠాన్‌కోట్, కండ్రోలి, మిర్తాల్, బంగ్లా, ముకేరియా స్టేషన్లలో ఆపేందుకు విఫలయత్నం చేశారు. ఆ తర్వాత పట్టాలపై స్టాపర్స్‌ను అమర్చినా ఫలితం లేకపోయింది. అయితే ముకేరియా స్టేషన్ దాటాక రైలు వేగం నెమ్మదించింది. ఈ క్రమంలో రైల్వే అధికారులు ఉచ్చి బస్సీ స్టేషన్ వద్ద రైలు నిలిపివేశారు. అయితే ఈ విషయం తెలిసిన వెంటనే ఆ రూట్లోని అన్ని రైల్-రోడ్ క్రాసింగ్లను మూసివేశామని జీఆర్పీ ఎస్ఐ (జలంధర్) అసోక్ కుమార్ తెలిపారు.
ఈ ఘటనపై రైల్వే అధికారులు తీవ్రంగా స్పందించారు. అసలు ఈ ఘటన ఎలా జరిగిందో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నామని జమ్మూ రైల్వే డివిజన్ ట్రాఫిక్ మేనేజర్ తెలిపారు. భవిష్యత్‌లో ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండడానికి, భద్రతా లోపాలను గుర్తించడానికి విచారణ ప్రారంభించామని వెల్లడించారు. ఈ విషయం కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వని వైష్ణవ్ దృష్టికి వెళ్లగా ఆయన విచారణకు ఆదేశించారు.