తెలంగాణ

telangana

కారు సైడ్ డోర్స్ అద్దాలకు టింట్ వాడితే నేరమా? చట్టం ఏం చెబుతోంది? - Tinted Windows Rules In India

By ETV Bharat Telugu Team

Published : Jul 21, 2024, 1:43 PM IST

Tinted Windows Legal Or Illegal : కార్ల సైడ్ డోర్స్ అద్దాలకు టింట్ (సన్ ఫిల్మ్) వాడి చాలామంది వాహన తనిఖీల్లో దొరికిపోతుంటారు. జరిమానాలను చెల్లిస్తుంటారు. అసలు సైడ్ డోర్స్ అద్దాలకు టింట్ ఎందుకు వాడకూడదు? వాడితే నేరమా? చట్టం ఏం చెబుతోంది?

Tinted Windows Rules In India
Tinted Windows Rules In India (Getty Images)

Tinted Windows Legal Or Illegal : తెలిసో తెలియకో కొందరు తమ కార్ల సైడ్ డోర్స్ అద్దాలకు టింట్ (సన్ ఫిల్మ్) వినియోగిస్తుంటారు. వీటివల్ల ఎండ నేరుగా కారులోని క్యాబిన్‌లోకి ప్రవేశించదని భావిస్తుంటారు. టింటెడ్ సన్ ఫిల్మ్‌లు ముదురు నలుపు రంగులో ఉంటాయి. కొందరైతే అత్యుత్సాహానికి పోయి కారుకు ముందు, వెనుక ఉండే విండ్ స్క్రీన్స్ అద్దాలకు కూడా టింట్‌లు అమర్చుకుంటారు. దీనివల్ల కారులో జర్నీ చేసేవారికి కంఫర్ట్ లభించడం సంగతి అలా ఉంచితే కారు యజమానికి మాత్రం జరిమానాల మోత తప్పదు. ఎందుకంటే ఇలా కార్ల అద్దాలపై టింట్‌ను వినియోగించడం అపరాధం. కారులో కూర్చున్న వారు బయటకు కనిపించేలా అద్దాలు స్పష్టంగా ఉండాలని మోటార్ వాహన చట్టం చెబుతోంది. నలుపు అద్దాల మాటున వాహనాల లోపల నేరాలు జరగకూడదనే ఉద్దేశంతో ఈ నిబంధనను అమలు చేస్తున్నారు.

చట్టం ఏం చెబుతోంది?
మోటార్ వాహన చట్టం-1988 ప్రకారం కారులోని అద్దాలకు 100 శాతం టింట్ చేయించడం అపరాధం. వాహనంలోని ముందు, వెనుక విండ్‌స్క్రీన్స్ అద్దాలకు 70 శాతం స్పష్టమైన విజిబిలిటీ ఉండి తీరాల్సిందే. అంటే బయట నుంచి అంతమేర క్లియర్‌గా కారులోని చూడగలిగేలా ఉండాలి. ఈ విజిబిలిటీ తగ్గేలా ఎవరైనా ఆ అద్దాలపై నలుపురంగు సన్ ఫిల్మ్‌లు వేయించుకుంటే వాహన చట్టాన్ని ఉల్లంఘించినట్లుగా పరిగణిస్తారు.

ఇక కారులోని సైడ్ డోర్స్ అద్దాలకు కనీసం 50 శాతం స్పష్టమైన విజిబిలిటీ ఉండాలి. కార్ల కంపెనీలు ఈ ప్రమాణాలకు లోబడే వాటికి అద్దాలను అమర్చి అందిస్తుంటాయి. వాస్తవానికి సాయంత్రం వేళల్లో అధిక టింట్ కలిగిన అద్దాల నుంచి ఎదురుగా లేదా వెనుక నుంచి వస్తున్న వాహనాలను గుర్తించడం కష్టతరంగా ఉంటుంది. ఇది ప్రమాదాలకు దారితీసే ముప్పు ఉంటుంది. అందుకే ప్రభుత్వం నిర్దేశించిన ప్రమాణాల ప్రకారమే కారు అద్దాలకు టింట్ చేయించాలి.

వారికి మినహాయింపు
ఎండ నుంచి రక్షణ పొందేందుకే కార్ల అద్దాలకు సన్ ఫిల్మ్‌లు వేయించుకుంటారు. ఈ అవసరాన్ని గుర్తించిన మారుతీ సుజుకీ, టయోటా కిర్లోస్కర్ మోటార్స్ తమ వాహనాలకు చట్టబద్ధమైన ఆకుపచ్చ- లేత రంగు కిటికీలను అందిస్తున్నాయి. ఇవి క్యాబిన్‌లోకి ప్రవేశించే హానికరమైన అతినీలలోహిత కిరణాలను నిరోధిస్తాయి. నేరుగా కంపెనీ నుంచి వచ్చే సెట్టింగ్ కావడం వల్ల రోడ్డు రవాణా అధికారులు కూడా అభ్యంతరం చెప్పరు.

మన దేశంలో జెడ్, జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత కలిగిన వీఐపీ సిబ్బంది వాహనాలకు ముదురు నలుపు రంగులోని సన్ ఫిల్మ్‌‌లను వాడొచ్చు. వారికి ఉన్న రిస్క్‌ను పరిగణనలోకి తీసుకొని టింటెడ్ విండోస్‌ను వాడేందుకు కేంద్ర హోంశాఖ, పోలీసు విభాగం అనుమతులు మంజూరు చేస్తుంది.

జరిమానాలివీ!
కార్ల అద్దాలకు పరిమితికి మించిన స్థాయిలో టింట్ చేయించే వాహనదారులకు మొదటిసారి రూ. 100 జరిమానా, రెండోసారి రూ. 300 జరిమానా విధిస్తారు. మూడోసారి కూడా ఆ వాహన యజమాని కారు అద్దాలపై అదే టింట్‌తో కనిపిస్తే డ్రైవింగ్ లైసెన్స్‌ను నిలిపివేసే అధికారం వాహన తనిఖీ అధికారులకు ఉంటుంది.

టింటెడ్ గ్లాసెస్‌కు 3 ప్రత్యామ్నాయాలివే!
సన్ షేడ్స్: సైడ్ గ్లాసుల నుంచి కారు క్యాబిన్‌లోకి నేరుగా సూర్యరశ్మి ప్రవేశించకుండా నిలువరించేందుకు మనం సన్ షేడ్స్‌ను వాడొచ్చు. మనకు అవసరమైనప్పుడు వీటిని కారు సైడ్ గ్లాసులకు అడ్డంగా అతికించవచ్చు. చాలా ఫ్లెక్సిబుల్‌గా ఉండే మెష్‌తో వీటిని తయారు చేస్తారు.

ముదురు ఆకుపచ్చ యూవీ కట్ గ్లాస్: ఈ రకానికి చెందిన గ్లాస్‌ను చాలా వాహన కంపెనీలు ఇప్పటికే బిల్ట్‌ఇన్‌గా అందిస్తున్నాయి. ఈ అద్దాలు కారు క్యాబిన్‌లోకి ప్రవేశించే సూర్మరశ్మిలోని అతినీల లోహిత (యూవీ) కిరణాలను 80 శాతం వరకు తగ్గిస్తాయి. వీటికి రోడ్డు రవాణా అధికారులు అభ్యంతరం చెప్పరు.

రిట్రాక్టబుల్ డ్రాప్ షేడ్స్: ప్రముఖ ఎస్‌యూవీ కార్లు, సెడాన్ కార్లలో సైడ్ గ్లాసుల వద్ద ముడుచుకునే డ్రాప్ షేడ్స్‌ను అదనంగా అందిస్తున్నారు. ఎండగా ఉందనుకుంటే కారు లోపల ఉన్నవారు ఈజీగా డ్రాప్ షేడ్‌ను కిందకు దింపుకోవచ్చు. కారులో ఇన్‌బిల్ట్‌గా రాకుంటే బయట మార్కెట్ నుంచి తీసుకొని వాటిని ఫిట్ చేయించుకోవచ్చు.

ABOUT THE AUTHOR

...view details