Mobile App For Thunderbolts Pre Information :వానలు పడేటప్పుడు ఆకాశంలో మెరుపులు మెరిసి.. ఆపై ఒక్కసారిగా పెళ్లుమనే భారీ శబ్దంతో ఉరుములు సంభవిస్తుంటాయి. అయితే, వర్షాలు కురిసేటప్పుడు ఉరుములు, మెరుపులు రావడం సహజం. కానీ, కొన్నిసార్లు వీటితో పాటు ఆకస్మాత్తుగాపిడుగులు(Thunderbolts)పడుతుంటాయి. అలా పిడుగు పడినప్పుడు ఆ ప్రదేశంలో ఉన్నవారి ప్రాణాలు గాల్లో కలిసిపోవాల్సిందే! ఎందుకంటే.. పిడుగుకున్న శక్తి అలాంటిది. నిజానికి పిడుగు ఎప్పుడు, ఎక్కడ పడుతుందో కరెక్ట్‌గా చెప్పలేం. దాంతో దీని కారణంగా ఏటా ఎంతో మంది ప్రాణాలు వదులుతున్నారు.
అయితే, చాలా మందికి తెలియని విషయమేమిటంటే.. పిడుగు వంటి విపత్కర పరిస్థితుల గురించి ముందుగానే సమాచారం తెలుసుకొని ప్రాణాలు కాపాడుకోవచ్చు! అందుకోసం మీరు చేయాల్సిందల్లా.. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ మొబైల్ యాప్‌ను మీ ఫోన్లో ఇన్స్టాల్ చేసుకోవడమే అంటున్నారు నిపుణలు. అది మీ మొబైల్లో ఉన్నట్లయితే అరగంట ముందుగానే మీ ప్రాంతంలో పిడుగు పడుతుందా? లేదా? అనే విషయాన్ని తెలుసుకోవచ్చంటున్నారు. ఇంతకీ, ఏంటి ఆ మొబైల్ యాప్? ముందుగానే సమాచారం ఎలా తెలుసుకోవచ్చు? దాన్ని ఎలా ఉపయోగించాలి? అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
పిడుగుల గురించి ముందుగానే హెచ్చరించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆ యాప్ పేరు.. 'Damini: Lightning Alert'. దీనిని 2020లో.. కేంద్ర భూవిజ్ఞాన శాఖ కింద పనిచేసే 'ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ట్రాపికల్ మీటియరాలజీ(ఐఐటీఎం)' రూపొందించడం జరిగింది. ఈ యాప్ ద్వారా మీరు ఉన్న ప్రదేశంలో పిడుగు పడుతుందో లేదో అరగంట ముందుగానే తెలుసుకోవచ్చు. అంటే.. మొబైల్లో మీ జీపీఎస్ లొకేషన్ ఆధారంగా 20 నుంచి 40 కిలోమీటర్ల పరిధిలో పిడుగుల గురించిన సమాచారాన్ని ఈ యాప్ ముందుగానే మిమ్మల్ని హెచ్చరించడం జరుగుతుంది. అంతేకాదు.. ఈ యాప్ పిడుగులు పడే ప్రాంతంలో ఉన్నప్పుడు ఏవిధంగా జాగ్రత్తలు తీసుకోవాలో కూడా తెలియజేస్తుంది.