Modi On Delhi Results 2025 :ఆమ్‌ఆద్మీ పార్టీ షార్ట్‌కట్ రాజకీయాలకు దిల్లీ ఓటర్లు షార్ట్ సర్య్కూట్ ఇచ్చారని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. పదేళ్ల కష్టాలు, సమస్యల నుంచి దిల్లీకి విముక్తి లభించిందన్నారు. దిల్లీని అభివృద్ధి చేసి ప్రజల రుణం తీర్చుకుంటామని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. దిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన సందర్భంగా బీజేపీ శ్రేణులు ఆ పార్టీ ప్రధాన కార్యాలయంలో విజయోత్సవ సంబరాలు నిర్వహించారు. ఈ వేడుకల్లో ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు నేతలు మోదీని గజమాలతో సత్కరించారు. అనంతరం కార్యకర్తలను ఉద్దేసించిన ప్రధాని మోదీ ప్రసంగించారు.
"దిల్లీ విజయం సామాన్య విషయం కాదు. వికసిత్ రాజధానిగా మార్చే అవకాశం ఇచ్చింనందుకు దిల్లీ ప్రజలకు కృతజ్ఞతలు. దిల్లీ ప్రజలు చూపించిన ప్రేమను అనేక రెట్లు పెంచి తిరిగిస్తాం. పదేళ్ల కష్టాలు, సమస్యల నుంచి దిల్లీకి విముక్తి లభించింది. పదేళ్లపాటు దిల్లీని అహంకారంతో పరిపాలించారు. ఇక నుంచి దిల్లీలో వికాస్, విజన్, విశ్వాస్ నినాదాలతో పరిపాలన. దిల్లీ విజయానికి కష్టపడిన కార్యకర్తలకు అభినందనలు. నిజమైన విజేతలు దిల్లీ ప్రజలే. అడ్డదారుల్లో వచ్చిన వారికి ప్రజలు షాక్ ఇచ్చారు. లోక్‌సభ ఎన్నికల్లో వరుసగా 3 సార్లు మొత్తం సీట్లు మాకే ఇచ్చారు. డబుల్ ఇంజిన్ సర్కారుపై ఇక్కడి ప్రజలు నమ్మకం ఉంచారు. హరియాణా, మహారాష్ట్రలో కూడా గొప్ప విజయం సాధించాం. దిల్లీ ఒక మినీ భారత్. దిల్లీలో గెలిచామంటే దేశమంతా బీజేపీ దీవించినట్లే. దిల్లీ అభివృద్ధికి నాది గ్యారెంటీ."
-నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి