Two Line Roads in Telangana : రాష్ట్ర ప్రభుత్వం ప్రతి మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రానికి రెండు వరుసల రహదారి నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేసింది. ఆ దిశగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే రాష్ట్రంలో రెండు వరుసల రహదారులు 12,836 కి.మీ. మేర ఉన్నాయి. ఇప్పుడు ఒక వరుస రహదారులు 16,013 కి.మీ. మేర ఉన్నాయి. ఇందులో మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు 898 కిలోమీటర్ల మేర సింగిల్ రోడ్లు ఉన్నాయి. వీటిని రెండు వరుసలుగా తీర్చిదిద్దాలని అధికారులు నిర్ణయించారు.
కొత్త జిల్లాలు ఏర్పడిన తర్వాత జిల్లా, మండల కేంద్రాలకు మధ్య దూరం బాగా తగ్గింది. అలాగే ప్రజల రాకపోకలు పెరిగాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు, వ్యాపారాలు, చదువుల నిమిత్తం జిల్లా కేంద్రాలకు మండల కేంద్రాలతో పాటు వాటి పరిధిలోని గ్రామాల నుంచి ఎక్కువ మంది ఆ మార్గాల గుండా ప్రయాణిస్తారు. ఈ రాకపోకలు ప్రధానంగా 10 వేల 25 వేల వరకు జనాభా ఉన్న మండల కేంద్రాల నుంచి ఎక్కువగా సాగుతున్నాయి. అయితే చాలా చోట్ల సింగిల్ రోడ్లు ఉంటున్నాయి. దీంతో రవాణాకు ఇబ్బందిగా ఉంటోంది.
ఈ నేపథ్యంలో రాబోయే నాలుగేళ్లలో మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు రెండు వరుసల రహదారులను (డబుల్ రోడ్లు) నిర్మించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఇందుకు సంబంధించిన ప్రక్రియపై అధికారులు సైతం దృష్టి సారించారు. అలాగే రాష్ట్రంలో నాలుగు వరుసల రహదారి నిర్మాణాలు 1,151 కి.మీ.గా ఉన్నాయి. ఈ విధంగా రోడ్లను రెండు వరుసలు చేయడం వల్ల ప్రయాణికులకు, రవాణాకు మార్గం సుగమం కానుంది.
ఈ నియోజకవర్గాల్లోనే రెండు వరుసల రహదారులు ఎక్కువ :
- పూర్వ మహబూబ్‌నగర్ జిల్లా పరిధిలో అచ్చంపేటలో 54.40 కి.మీ., అలంపూర్‌లో 36.80 కి.మీ., గద్వాలలో 27.30 కి.మీ. రెండు వరుసల రహదారులు నిర్మించనున్నారు.
- పూర్వ నల్గొండ జిల్లా పరిధిలోని దేవరకొండ నియోజకవర్గంలో 21.40 కి.మీ., భువనగిరిలో 20.90 కి.మీ., ఆలేరులో 22.20 కి.మీ. రెండు వరుసల రహదారులు నిర్మాణం.
- ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పెద్దపల్లిలో 52.73 కి.మీ., వేములవాడలో 44.80 కి.మీ.
- ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ములుగులో 37.75 కి.మీ.
- ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని ఎల్లారెడ్డిలో 13.81 కి.మీ., కామారెడ్డిలో 6.76 కి.మీ.
- ఉమ్మడి రంగారెడ్డి జిల్లా పరిధిలో వికారాబాద్‌లో 38 కి.మీ., పరిగిలో 22 కి.మీ.
- పూర్వ మెదక్ జిల్లా పరిధిలోని నారాయణఖేడ్‌లో 35.80 కి.మీ, నర్సాపూర్‌లో 39.00 కి.మీ. దుబ్బాకలో 50.86 కి.మీ.
- ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆసిఫాబాద్ నియోజకవర్గంలో 88 కి.మీ.
గుంతల రోడ్లకు గుడ్ బై - తెలంగాణలో ఇక పల్లెపల్లెనా తారు రోడ్లు