Test Blood Sugar With Breath :భారతదేశంలో వేగంగా విస్తరిస్తున్న వ్యాధి మధుమేహం. ప్రస్తుతం చిన్నా పెద్దా తేడా లేకుండా అందరిలోనూ ఇది కనిపిస్తోంది. అయితే, ఈ మధుమేహం స్థాయిలను గుర్తించాలంటే రక్తం తీసి గ్లూకోమీటర్‌తో పరీక్షించాల్సిందే. ఇలాంటి సమస్యకు పరిష్కారంగా కేవలం శ్వాసతోనే షుగర్ స్థాయిలను గుర్తించే పరికరాన్ని రూపొందించారు హిమాచల్ ప్రదేశ్‌లోని ఐఐటీ మండీ శాస్త్రవేత్తలు. అదెలా పనిచేస్తుందో ఇప్పుడు చూద్దాం.
మొదటగా వీరు తయారు చేసిన పరికరంలో మనం శ్వాసను ఊదాలి. ఆ తర్వాత ప్రత్యేకంగా రూపొందించిన మొబైల్ యాప్‌లో ఆక్సిజన్, బీపీతో పాటు మరికొన్ని వివరాలను నమోదు చేయాలి. అనంతరం రెండింటి వివరాలను క్రోడీకరించి శరీరంలోని షుగర్ స్థాయిలను చెబుతోంది పరికరం. దీనికి నాన్ ఇన్వాసివ్ గ్లూకోమీటర్ అని పేరు పెట్టారు శాస్త్రవేత్తలు. ఇప్పటివరకు ఈ పరికరంతో అనేక మందికి పరీక్షలు చేయగా, మెరుగైన ఫలితాలు వచ్చాయని చెబుతున్నారు సీనియర్ ప్రాజెక్ట్ డైరెక్టర్ డాక్టర్ రీతు.
"హిమాచల్ ప్రదేశ్ లాంటి కొండ ప్రాంతాల్లో వైద్య సదుపాయాలు అంతగా ఉండవు. ఇలాంటి వారి కోసమే ఈ పరికరాన్ని రూపొందించాం. ఇది వారికి ఎంతో ఉపయోగపడుతుంది. అయితే, దీనిని వైద్య నిపుణుల పర్యవేక్షణలో రూపొందించలేదు. ఇప్పటి వరకు ఎయిమ్స్ బిలాస్‌పుర్ వారితో కలిసి సుమారు 560 శాంపిళ్లను పరీక్షించాం. వీటన్నింట్లో ఈ పరికరం మెరుగైన ఫలితాలనే ఇచ్చింది. ఈ పరికరంతో పరీక్షిస్తే ఒక్క శాతం మాత్రమే తప్పుగా వచ్చే అవకాశం ఉంది. అదే గ్లూకోమీటర్‌తో చేస్తే ఐదు శాతం తప్పుగా వచ్చే అవకాశం ఉంటుంది."