Telugu Voters Impact on Karnataka Elections : ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలతో సరిహద్దులను పంచుకునే కర్ణాటకలో ఎక్కువ సంఖ్యలో తెలుగు ఓటర్లు ఉన్నారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో వారిని ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు పోటీపడుతున్నారు. కొన్ని స్థానాల్లో అభ్యర్థుల గెలుపోటములను తెలుగు ప్రజలు శాసించగలిగే స్థాయిలో ఉన్నారు. అందుకే ఓటర్లను ఆకట్టుకునేందుకు వివిధ పార్టీలు ఆంధ్ర, తెలంగాణల నుంచి తెలుగు ప్రముఖులను రప్పించి మరీ ప్రచారం చేయిస్తుంటారు. ఈ ఎన్నికల్లోనూ అదే కొనసాగుతోంది.
ఆధిక్యానికి అడ్డుకట్ట
2019 ఎన్నికల్లో 50వేల లోపు ఆధిక్యంలో గెలిచిన మూడు స్థానాలు చామరాజనగర (1,817), కొప్పళ (8,397), తుమకూరు (13,339). అయితే, వీటిలో రెండింట తెలుగు ఓటర్ల ప్రభావం అధికంగా ఉంది. 50వేల నుంచి లక్ష లోపు ఆధిక్యంతో గెలిచిన నాలుగు స్థానాల్లో బళ్లారి (55,707), బెంగళూరు కేంద్రం (70,968) చిత్రదుర్గ (80,178), కలబురగిలో (95,452) మూడు స్థానాలు కూడా తెలుగు ప్రజలు ఎక్కువగా ఉన్నవే. లక్ష నుంచి రెండు లక్షల లోపు ఆధిక్యం ఉన్న స్థానాల్లోనూ ఎక్కువగా తెలుగు ఓటర్ల ప్రభావాన్ని నేతలు గుర్తించారు. కొద్దిపాటి ఆధిక్యాలు నమోదయ్యే స్థానాల్లో తెలుగు ఓటర్లు నిర్ణయాత్మకంగా మారడం ప్రతి ఎన్నికల్లోనూ గమనించవచ్చు. అందుకే వివిధ పార్టీలు తెలుగు వారి కోసం ప్రత్యేక కార్యక్రమాలు, ప్రముఖులతో ప్రచారాలు చేయించి మరి ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంటాయి. అసెంబ్లీ ఎన్నికల్లో 5 వేలలోపు ఓట్లతో అభ్యర్థులు ఓడటం, గెలవటం తెలుగు ఓటర్ల ప్రభావంతోనేనని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు.
రాజకీయ ఉత్సాహం
గత ఐదేళ్లుగా రాష్ట్రంలో స్థిరపడిన తెలుగు ఓటర్లకు స్థానిక రాజకీయాలపై ఉత్సాహం పెరగడం గమనార్హం. ఇక్కడి తెలుగు ప్రజలంతా ఐటీ ఉద్యోగాలు, వ్యాపారాలు, చదువుల కోసం వచ్చినవారే ఉన్నారు. జాతీయ రాజకీయాల్లో జరిగే సమీకరణాలను ఎప్పటికప్పుడు గమనిస్తూ అందుకు తగ్గట్లుగా స్పందిస్తుంటారు. ఐటీ నగరం బెంగళూరులో స్థిరపడిన ఐటీ ఉద్యోగులు ఆంధ్ర, తెలంగాణ రాజకీయ పోకడలను గమనిస్తుంటారు. కోలారు, తుమకూరు, బీదర్, బళ్లారి, రాయచూరు, చిత్రదుర్గ, కొప్పళ, బీదర్ ప్రాంతాల్లోని తెలుగువారు ఇక్కడి రాజకీయాలతో మమేకమై ఉంటారు. అయితే ఈ ఐదేళ్లలో బెంగళూరుకు వచ్చి స్థిరపడిన వారి సంఖ్య అనధికారికంగా 30 లక్షలకు పైగా ఉందని సమాచారం. మొత్తంగా రాష్ట్రంలో దాదాపు ఏడు కోట్లకు చేరిన జనాభాలో కనీసం కోటి మంది తెలుగు ప్రాంతాలకు చెందినవారు ఉన్నారని అంచనా.
చంద్రబాబుకు మద్దతుగా
ఇక గతేడాది సెప్టెంబరులో టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టుకు నిరసనగా వేలాది మంది తెలుగు ప్రజలు బెంగళూరు, బళ్లారి, రాయచూరు, కోలారు తదితర జిల్లాల్లో ఆందోళన చేపట్టారు. వీరంతా ప్రస్తుతం సామాజిక మాధ్యమాల ద్వారా రాజకీయ అంశాలపై సందేశాలు, ప్రచారాలు చేస్తూ తెలుగు ఓటర్లను చైతన్యపరుస్తూ ఉన్నారు. వీరి అభిమానాన్ని గుర్తించిన చంద్రబాబు గతేడాది డిసెంబరులో బెంగళూరులో తెలుగు వారితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.