Bullet Rani Rajalakshmi Kumbh Mela 2025 : దేశవ్యాప్తంగా భారతీయ సంస్కృతిని వ్యాప్తి చేయడం, ప్రయాగ్ రాజ్ మహా కుంభమేళా ప్రాముఖ్యాన్ని ప్రజలకు తెలియజేయడానికి నడుం బిగించారు ఓ సన్యాసిని. ఈ క్రమంలో యూపీలోని భదోహ్ నుంచి ప్రయాగ్ రాజ్ వరకు బుల్లెట్ బైక్‌పై యాత్ర చేపట్టాలని నిర్ణయించుకున్నారు తమిళనాడుకు చెందిన రాజలక్ష్మి అలియాస్ బుల్లెట్ రాణి. జనవరి 9న భదోహ్లో యాత్ర ప్రారంభించి, ఇప్పటికే ప్రయాణించి కాన్పుర్‌కు చేరుకున్నారు.
22 రోజులపాటు 36 జిల్లాల మీదుగా రెండు వేల కిలోమీటర్లకుపైగా రాజలక్ష్మి బైక్ యాత్ర కొనసాగి ప్రయాగ్ రాజ్‌లో ముగియనుంది. అయితే మహాకుంభమేళాకు భారీ సంఖ్యలో భక్తులు తరలిరావాలని విజ్ఞప్తి చేశారు బుల్లెట్ రాణి. మహా కుంభమేళాలో సంపూర్ణ విశ్వాసంతో పుణ్యస్నానం చేయడం ద్వారా భక్తులు తమ జీవితాలను పవిత్రం చేసుకోవాలని సూచించారు. భారతీయ సంస్కృతిని, సనాతన ధర్మాన్ని కాపాడటానికి ఒక బోర్డు ఏర్పడితే చాలా బాగుంటుందని అభిప్రాయపడ్డారు.
"నా స్వస్థలం తమిళనాడులోని మధురై. ప్రస్తుతం యూపీలోని భదోహ్లో నివసిస్తున్నాను. నేను సన్యాసిని. రామ్ జానకి మందిర్ ఆశ్రమంలో 180 అడుగుల రాగి శివలింగాన్ని ప్రతిష్ఠిస్తున్నా. నా తల్లిదండ్రులకు నేనే ఏకైక సంతానాన్ని. దేశ ప్రజలందరూ కుంభమేళాలో పుణ్య స్నానం చేయాలి. మతం, విశ్వాసంపై నిరసన తెలిపే హక్కు ఎవరికీ లేదు. నా బైక్ ప్రయాణంలో జ్యోతిర్లింగాలు, కుంభమేళా ప్రాముఖ్యాన్ని ప్రజలకు తెలియజేస్తా. వారణాసి, ఘాజీపుర్, అయోధ్య, లఖ్‌నవూ, దిల్లీ, మథుర, చిత్రకూట్ మీదుగా జనవరి 20కి ప్రయోగ్‌రాజ్‌కు చేరుకుంటా. ప్రతి వ్యక్తికి దేవునిపై విశ్వాసం, భక్తి ఉండాలి. మన విశ్వాసాన్ని, సంస్కృతిని కాపాడుకోవడానికి మహా కుంభమేళాకు వెళ్లాలి. అక్కడ గంగానదిలో స్నానం ఆచరించాలి"
-- రాజలక్ష్మి, అలియాస్ బుల్లెట్ రాణి
'సనాతన బోర్డు అవసరం'
దేశవ్యాప్తంగా ఇప్పటికే ఉన్న సనాతన బోర్డు ఏర్పాటు డిమాండ్‌కు తాను పూర్తిగా మద్దతు ఇస్తున్నానని రాజలక్ష్మి తెలిపారు. ఇది కచ్చితంగా సరైన డిమాండేనని అభిప్రాయపడ్డారు. దేశ సంస్కృతి, దేవాలయాలు, సనాతన ధర్మాన్ని కాపాడటానికి ఈ బోర్డును ఏర్పాటు చేయడం చాలా ముఖ్యమని పేర్కొన్నారు. సనాతన బోర్డు వీలైనంత త్వరగా ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.
బుల్లెట్ రాణికి ఘనస్వాగతం
కాగా, ఆదివారం నాటికి బుల్లెట్ రాణి బైక్ యాత్ర బీజేపీ ప్రాంతీయ కార్యాలయం ఉన్న కేశవ్ నగర్‌కు చేరుకుంది. దీంతో బీజేపీ రీజనల్ అధ్యక్షుడు ప్రకాశ్ పాల్, పార్టీ కార్యకర్తలు రాజలక్ష్మికి పూలమాల వేసి ఘన స్వాగతం పలికారు.
కాగా, గతంలోనూ రాజలక్ష్మి పలుమార్లు వార్తల్లో నిలిచారు. 2024లో ప్రధాని నరేంద్ర మోదీకి మద్దతుగా 21,000 కిలోమీటర్ల బైక్ యాత్ర చేపట్టారు.