తెలంగాణ

telangana

ETV Bharat / bharat

మహా కుంభమేళాలో తెలుగు ప్రజలు- రామోజీరావును తలుచుకుని ఎమోషనల్​! - MAHA KUMBH 2025

మహాకుంభ మేళాకు తెలుగు రాష్ట్రాల నుంచి పెద్దసంఖ్యలో భక్తజనం- 'ఈటీవీ భారత్' లోగోను చూసి వచ్చి విలేకరిని పలకరించిన తెలంగాణవాసులు

Maha Kumbh Mela 2025
Maha Kumbh Mela 2025 (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Jan 15, 2025, 10:39 AM IST

Maha Kumbh Mela 2025 : పరమ పవిత్ర మహాకుంభ మేళా జరుగుతున్న ఉత్తర్​ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌‌కు దేశవిదేశాల నుంచి భక్తజనం పోటెత్తుతున్నారు. త్రివేణీ సంగమంలో పుణ్య స్నానాలు చేసేందుకు మన తెలుగు రాష్ట్రాల నుంచి కూడా పెద్దసంఖ్యలో భక్తులు తరలి వెళ్తున్నారు. ఈ తరుణంలో మహాకుంభ మేళాలో పాల్గొనేందుకు తెలంగాణ నుంచి ప్రయాగ్‌రాజ్‌‌కు చేరుకున్న పలువురిని 'ఈటీవీ భారత్' పలకరించింది. 'ఈటీవీ భారత్' లోగోను చూడగానే వారు పులకరించిపోయారు. ఇది మా ఛానల్ అని ఉద్వేగంగా చెప్పారు. రామోజీ గ్రూపు మాజీ ఛైర్మన్, దివంగత రామోజీరావును వారు గుర్తు చేసుకున్నారు. మహా కుంభమేళాకు తమకు ఎదురైన అనుభూతులను 'ఈటీవీ భారత్‌'తో పంచుకున్నారు.

'ఈటీవీ భారత్' మైక్‌ను చూడగానే!
మహా కుంభ మేళా ప్రాంగణంలో 'ఈటీవీ భారత్' మైక్‌ను చూడగానే హైదరాబాద్ వాసులు బాలకృష్ణ, రవితేజ ఈటీవీ భారత్ విలేకరి వద్దకు చేరుకున్నారు. రామోజీరావును గుర్తు చేస్తూ ఇది మా ఛానల్ అని చెప్పారు. మహాకుంభ మేళాలో ఈసారి చేసిన ఏర్పాట్లను వారు కొనియాడారు. 'మంగళవారం ఉదయాన్నే మేం ప్రయాగ్​రాజ్‌కు చేరుకున్నాం. త్రివేణి సంగమంలో స్నానం చేసేందుకు ఇక్కడి వచ్చాం. సాధువులను, మహర్షులను కళ్లారా చూశాం. మహాకుంభాన్ని చూసి మేం ధన్యులమయ్యాం. ఈ సంగమంలో స్నానం చేసి పవిత్రులుగా మారుతాం. మోక్షం లభించాలని కోరుకుంటున్నాం' అని హైదరాబాద్‌కు చెందిన బాలకృష్ణ చెప్పుకొచ్చారు.

ఈటీవీ భారత్ ప్రజలందరి ఛానల్
తెలంగాణ రాష్ట్రానికి చెందిన రవితేజ మాట్లాడుతూ 'ఈటీవీ భారత్ రామోజీరావు గారి ఛానల్. కాబట్టి అది మా ప్రజలందరి ఛానల్. త్రివేణి సంగమంలో పుణ్య స్నానం చేసేందుకు తెలంగాణ నుంచి వచ్చాం. పుణ్య స్నానం చేసిన తర్వాత కాశీకి వెళ్లి కాశీ విశ్వనాథుడిని దర్శించుకుంటాం. అక్కడి నుంచి అయోధ్య రామయ్య సన్నిధికి వెళ్తాం. హర్ హర్ మహాదేవ్' అని పేర్కొన్నారు.

మహాకుంభ మేళాలో రామోజీరావును గుర్తు చేసుకున్న తెలంగాణవాసులు (ETV Bharat)

2 రోజుల్లో 5 కోట్ల మంది పుణ్యస్నానాలు
జనవరి 13న ప్రారంభమైన మహాకుంభ మేళా నేటి(బుధవారం)తో మూడో రోజులోకి ప్రవేశించింది. మొదటి రెండు రోజుల్లో దాదాపు 5 కోట్ల మందికిపైగా భక్తులు పుణ్య స్నానాలు ఆచరించారు. దీంతో ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక ఘట్టంగా ఈ మహాకుంభ మేళా నిలిచింది. మహాకుంభ మేళాలో మకర సంక్రాంతి వేళ మంగళవారం రోజున ఎంతో మంది భక్తులు తొలి అమృత స్నానం చేశారు. ఈసందర్భంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో హెలికాప్టర్ల ద్వారా త్రివేణీ సంగమంలో పుణ్య స్నానాలు చేస్తున్న భక్తులపై గులాబీ పూల వర్షం కురిపించారు. దీంతో భక్తజనం భక్తిభావంతో పులకించి పోయారు. జై శ్రీరాం, హర్ హర్ మహాదేవ్ నినాదాలు చేశారు.

ABOUT THE AUTHOR

...view details