Srilanka reaction on Katchatheevu :లోక్‌సభ ఎన్నికల ముందు కచ్చతీవు దీవిపై దుమారం రేగుతున్న వేళ శ్రీలంక స్పందించింది. కచ్చతీవు దీవిని తమకు తిరిగి ఇచ్చేయాలన్న భారత్ విజ్ఞప్తికి ఎలాంటి ఆధారం లేదని శ్రీలంక మత్స్యశాఖ మంత్రి డగ్లస్ దేవానంద అన్నారు. 1974లో దేశంలోని జాలర్ల ప్రయోజనాలను పట్టించుకోకుండా కచ్చతీవు దీవిని శ్రీలంకకు అప్పగించినట్లు ప్రధాని మోదీ కాంగ్రెస్ పార్టీతోపాటు డీఎంకేను టార్గెట్ చేస్తున్న నేపథ్యంలో శ్రీలంకలోని తమిళనేతలు స్పందించారు. ఇది ఎన్నికల సమయమని, ఈ తరుణంలో అలాంటి ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకోవటం అసాధారణమేమీ కాదని శ్రీలంక మంత్రి దేవానంద పేర్కొన్నారు.
1974లో ఇరుదేశాలకు చెందిన మత్స్యకారులు తమ ప్రాదేశిక జలాల్లో చేపలు పట్టేందుకు ఒప్పందం జరిగినట్లు చెప్పిన దేవానంద, 1976లో ఆ ఒప్పందాన్ని సమీక్షించి సవరణలు చేసినట్లు తెలిపారు. కచ్చతీవు దీవి పరిసరాల్లో ఇరుదేశాలకు చెందిన జాలర్లు చేపలు పట్టకుండా నిషేధం విధించినట్లు శ్రీలంక మంత్రి దేవానంద వెల్లడించారు. కన్యాకుమారి దిగువన విస్తృతమైన సముద్ర వనరులతో కూడిన వెస్ట్ బ్యాంక్ అనే ప్రదేశం ఉందని, అది కచ్చతీవు దీవి కంటే 80 రెట్లు పెద్దదన్నారు. 1976 సమీక్షా ఒప్పందంలో భాగంగా భారత్ దాన్ని పొందినట్లు దేవానంద ప్రకటించారు.
భారత్‌కు చెందిన కచ్చతీవు దీవిని కేంద్రంలోని కాంగ్రెస్ సర్కార్ 1974లో శ్రీలంకకు అప్పగించింది. దీనిపై ఇటీవల తమిళనాడు బీజేపీ నేత అన్నామలై ఆర్టీఐ ద్వారా సమాచారం సేకరించడం వల్ల మళ్లీ వార్తల్లోకి వచ్చింది. అయితే 1974 తర్వాత తమిళనాడులో ప్రతీ ఎన్నికల్లో ఇదే కీలకాంశంగా మారుతోంది. ఎన్నికల అనంతరం మరుగునపడుతోంది.