Sidhu Moose Wala Mother Pregnancy :దివంగత పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా తల్లిదండ్రులు త్వరలోనే తమ కుటుంబంలోకి మరో చిన్నారిని ఆహ్వానించనున్నట్లు తెలుస్తోంది. ఆయన తల్లి చరణ్ కౌర్ త్వరలోనే మరో బిడ్డకు జన్మనివ్వనున్నారట. ఈ మేరకు కుటుంబ వర్గాలు తెలిపినట్లు పలు జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.
ప్రముఖ గాయకుడు, కాంగ్రెస్ నేత సిద్ధూ మూసేవాలా 2022 మే 29న హత్యకు గురయ్యారు. మాన్సా జిల్లాలోని తన స్వగ్రామానికి వెళ్తుండగా మార్గమధ్యంలో దుండగులు ఆయనను అడ్డగించి తుపాకీతో కాల్చి చంపారు. అప్పట్లో ఆ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. తమ కుమారుడు సిద్ధూ మూసేవాలా మరణించినప్పటి నుంచి తల్లిదండ్రులు ఇద్దరూ ఒంటరిగానే జీవనం సాగిస్తున్నారు. సిద్ధూ మూసేవాలా హత్యకు గురవ్వడం ఆయన అభిమానులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. సుమారు 2 ఏళ్ల తరువాత సిద్ధూ తల్లి మరో చిన్నారికి జన్మనివ్వబోతున్నట్లు సమాచారం. అన్నీ అనుకూలిస్తే మరి కొద్ది నెలల్లో సిద్ధూ మరో చిన్నారికి సోదరుడు కానున్నారు.
అయితే, తన తల్లిదండ్రులకు సిద్ధూ ఒక్కడే సంతానం. కన్నబిడ్డను కోల్పోయిన సిద్ధూ తల్లిదండ్రులు వృద్ధాప్యంలో తోడు కోసం మరో బిడ్డను కనాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే ఐవీఎఫ్ ద్వారా ఇటీవల చరణ్ కౌర్ గర్భం దాల్చినట్లు ఆమె సోదరుడు వెల్లడించారు. మార్చిలో ఆమె బిడ్డకు జన్మనివ్వనున్నట్లు తెలిపారు. గత కొన్ని నెలలుగా ఆమె మీడియాకు దూరంగా ఉంటున్నారు. ప్రస్తుతం కౌర్ వయసు 58 ఏళ్లు కాగా, సిద్ధూ తండ్రి బాల్కౌర్ సింగ్ వయసు 60ఏళ్లు.