Sidhu Moose Wala Mother IVF Treatment :దివంగత సింగర్ సిద్ధూ మూసేవాలా తల్లిదండ్రులు ఐవీఎఫ్ ద్వారా బిడ్డకు జన్మనిచ్చిన విషయంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. 58 ఏళ్ల వయసులో చరణ్ కౌర్ IVF ద్వారా బిడ్డకు జన్మనివ్వడంపై ఆరా తీసింది. ఈ ట్రీట్‌మెంట్‌కు సంబంధించి వయో పరిమితి గురించి ప్రస్తావించింది. ఈ మేరకు పంజాబ్ ప్రభుత్వానికి ఆదేశాలిచ్చింది.
సిద్ధూ మూసేవాలా తల్లి చరణ్ కౌర్ ఐవీఎఫ్ ట్రీట్‌మెంట్‌కు సంబంధించి నివేదిక సమర్పించాలని పంజాబ్ భగవంత్ మాన్ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది కేంద్ర ఆరోగ్య శాఖ. నోటీసులో అసిస్టెడ్ రీప్రోడక్టివ్ టెక్నాలజీ (రెగ్యులేషన్) యాక్ట్ 2021 సెక్షన్ 21(g) (i) ప్రకారం, ఐవీఎఫ్ పద్ధతి ద్వారా ట్రీట్మెంట్ పొందాలంటే మహిళ వయస్సు 21-50 సంవత్సరాలు ఉండాలని పేర్కొంది.
'పంజాబ్ ప్రభుత్వం వేధిస్తోంది!'
మరోవైపు, పంజాబ్ ప్రభుత్వం తనకు పుట్టిన రెండో బిడ్డ విషయంలో వేధిస్తుందని సిద్ధూ మూసేవాలా తండ్రి బాల్కౌర్ సింగ్ ఆరోపించారు. ఐవీఎఫ్ ద్వారా పుట్టిన చిన్నారికి సంబంధించిన పత్రాలను అందించమని పంజాబ్ ప్రభుత్వం కోరిందని తెలిపారు. అలాగే ఈ విషయంలో తనను అనేక ప్రశ్నలతో ప్రభుత్వ అధికారులు వేధిస్తున్నారని ఆరోపణలు చేశారు..
నా బిడ్డ చికిత్సకు సంబంధించిన విషయంలో ప్రభుత్వం వేధిస్తుందంటూ వీడియోను విడుదల చేశారు సిద్ధూ తండ్రి బాలాకౌర్ సింగ్. 'సీఎం సాబ్ చికిత్స పూర్తి అయ్యాక మీరు ఎక్కడికి రావాలంటే అక్కడి వస్తాను. నేను తప్పించుకునే ప్రయత్నాలు ఏం చేయడం లేదు. ఒకవేళ అలాంటివి ఏమైనా చేస్తే నాపై కేసు నమోదు చేసి జైలుకు పంపండి. నేను చికిత్సకు సంబంధించిన అన్ని పత్రాలను అందిస్తా' అని బాలాకౌర్ సింగ్ తెలిపారు. సిద్ధూ మూసేవాలా తల్లి చరణ్ కౌర్ 58 ఏళ్ల వయసులో ఐవీఎఫ్ ద్వారా మార్చి 17న పండంటి మగ బిడ్డకు జన్మినిచ్చారు.