How To Reduce Insomnia : చాలా మందికి అర్ధరాత్రి 12 గంటలైనా నిద్ర రావడం లేదు. రోజుల తరబడి ఇదే సమస్య ఉండటంతో కొందరు వైద్యులను సంప్రదించారు. చికాకు, విపరీతమైన తలనొప్పితో బాధపడుతున్నామని వైద్యులకు చెప్తున్నారు. జీవనశైలి, ఆహార నియమాల్లో లోపాలు, రోజుకు దాదాపు 5 గంటల పాటు సెల్‌ఫోన్ చూడటం వల్లనే ఈ సమస్యలు అని గుర్తించిన వైద్యులు తగు సూచనలు ఇస్తున్నారు.
కేంద్ర ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో పరీక్షల టైమ్‌లో విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన టెలీ మానస్ ఉచిత సహాయ నంబరుకు పలువురు విద్యార్థులు ఫోన్ చేశారు. ఇందులో చాలా మంది నిద్రసరిగా పట్టడం లేదని చెప్పారు. పది, ఇంటర్ విద్యార్థులు పరీక్షలు రాయబోతున్నారు. పరీక్షల ఒత్తిడితో చాలా మంది నిద్ర సరిగ్గా పోలేకపోతున్నారు.
ఉరుకుల పరుగుల జీవనశైలి, జంక్‌ఫుడ్, సెల్‌ఫోన్ తెరను చాలాసేపు చూడటం, ఒత్తిడి నాణ్యమైన నిద్రను దూరం చేస్తున్నాయి. శారీరక, మానసిక అనారోగ్యానికి కారణం అవుతున్నాయి. రోజూవారీ మన జీవితంలో కొన్ని మార్పులు చేసుకుంటే, సుఖ నిద్రను సొంతం చేసుకోవచ్చని అంటున్నారు వైద్య నిపుణులు. గతంలో 50 సంవత్సరాలకు పైబడిన వారికి ఈ సమస్య ఉండేదని, ప్రస్తుతం 30 సంవత్సరాల్లోపు వారిలోనూ కనిపిస్తోందని వైద్యులు అంటున్నారు. 18 నుంచి 30 సంవత్సరాల వారు కూడా రోజులో నలుగురైదుగురు ఈ సమస్యతో హాస్పిటల్‌కు వెళ్తున్నారని సమాచారం. మరికొందరు మానసిక వైద్య నిపుణులను కూడా సంప్రదిస్తూ చికిత్స పొందుతున్నారు.
ఇవి ఆచరించి చూడండి : -
- టైమ్‌కు నిద్రపోవడం, లేవడం అలవాటు చేసుకోవాలి.
- రాత్రి సమయాల్లో ఎక్కువ ఆహారం తీసుకోవద్దు.
- నిద్ర పోవడానికి 2 గంటల ముందే భోజనం చేయాలి.
- నిద్రకు గంట ముందు నుంచే సెల్‌ఫోన్‌కు దూరంగా ఉండాలి.
- రూమ్ ఉష్ణోగ్రత 25 డిగ్రీలు ఉండేలా చూసుకోవాలి.
- రూమ్‌లో అధిక ధ్వని, కాంతి లేకుండా చూసుకోవాలి.
- మంచి బుక్ కాసేపు చదవడం, శ్రావ్యమైన సంగీతం వినడం ద్వారా మంచి ఫలితం ఉంటుంది.
- ఐదు నిమిషాల పాటు దీర్ఘశ్వాస తీస్తూ వదిలితే మెదడుకు విశ్రాంతి లభించే అవకాశం ఉంది.
- ప్రతి రోజూ ఉదయం వ్యాయామానికి గంట టైమ్ కేటాయించాలి.
నాణ్యమైన నిద్రతో : -
- ఉదయం ఉత్సాహంగా ఉంటారు.
- ఒత్తిడి దూరమవుతుంది.
- జ్ఞాపకశక్తి మెరుగవుతుంది.
- మంచి ఆలోచనలు వస్తాయి.
నిద్రలేమితో వచ్చే సమస్యలు : -
- ఏకాగ్రత దెబ్బతింటుంది.
- హార్మోన్ల అసమతౌల్యం
- రోగ నిరోధక శక్తి తగ్గి వ్యాధుల బారిన పడతాం.
కాంతి కిరణాల వల్ల కంటికి, మెదడుకు ఇబ్బంది : సెల్‌ఫోన్ వీక్షించే టైమ్ పెరగడం మనిషిని నిద్రకు దూరం చేస్తోందని డాక్టర్లు అంటున్నారు. ముఖ్యంగా నిద్రపోయే ముందు గంట నుంచి గంటన్నర పాటు ఫోన్‌ను చూసేవారు పెరుగుతున్నారు. ఆ కాంతి కిరణాల వల్ల కంటికి, మెదడుకు ఇబ్బంది తలెత్తి చాలాసేపటి వరకు నిద్ర రావడం లేదు. రోజుకు సగటున మూడు గంటలపాటు స్క్రీన్‌ని చూస్తుండటం సమస్యను పెంచుతోంది.
"మెదడుపై ఒత్తిడి ఎక్కువ అయితే నిద్రలేమి సమస్య వస్తుంది. ఉదయం లేచిన తర్వాత బద్దకంగా, తలనొప్పిగా ఉంటుంది. ఇటీవల ఇలాంటి వారు చాలా మంది మా వద్దకు వస్తున్నారు. మెదడుకు తగిన విశ్రాంతి ఇవ్వాలి. నిద్రపోయే ముందు మెదడుకు, కంటికి ఒత్తిడి కలిగించే ఏ పనీ చేయవద్దు."- డా.కిషన్, మానసిక వైద్య నిపుణులు, కరీంనగర్
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.