Shivamogga Loksabha Election 2024 :త్వరలో లోక్‌సభ ఎన్నికలకు గాను కేంద్ర ఎన్నికల సంఘం మరికొద్దిరోజుల్లో నోటిఫికేషన్ విడుదల చేయనున్న నేపథ్యంలో రాజకీయ పార్టీలు ప్రచారాల్లో తలమునకలయ్యాయి. ఇప్పటికే బీజేపీ, కాంగ్రెస్ తొలి జాబితాను విడుదల చేయగా, రెండో లిస్ట్ రిలీజ్ చేసేందుకు సన్నద్ధమవుతున్నాయి. తమ మేనిఫెస్టోలకు కూడా తుదిరూపినిస్తున్నాయి.
అయితే కర్ణాటకలోని శివమొగ్గ లోక్‌సభ నియోజకవర్గంలో ఆ రాష్ట్ర మాజీ సీఎం బంగారప్ప కుటుంబం మరోసారి పోటీలో దిగుతోంది. బంగారప్ప కుమార్తె గీతా శివరాజ్ కుమార్‌కు కాంగ్రెస్ టికెట్ ఇచ్చింది. ఇటీవలే కాంగ్రెస్ విడుదల చేసిన తొలిజాబితాలో గీత పేరు ఉంది. అయితే ఆమెకు పోటీగా మరో మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత బీఎస్ యడ్యూరప్ప తనయుడు పోటీచేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే నాలుగుసార్లు!
బీజేపీ సిట్టింగ్ ఎంపీ బీవై రాఘవేంద్రకు టికెట్ కన్ఫామ్ అని వార్తలు వస్తున్నా ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. దీంతో శివమొగ్గలో మరోసారి ఇద్దరు మాజీ ముఖ్యమంత్రుల కుటుంబసభ్యులు పోటీపడనున్నారు. దీంతో అందరి దృష్టి ఆ నియోజకవర్గంపైనే పడింది. అయితే మాజీ సీఎంల కుటుంబాల మధ్య పోరు ఇది తొలిసారి కాదు. 2009 నుంచి ఇలానే జరుగుతోంది.
2009లో తొలిసారి
2009లో యడ్యూరప్ప కుమారుడు బీవై రాఘవేంద్ర తొలిసారిగా బీజేపీ నుంచి దివంగత మాజీ సీఎం ఎస్ బంగారప్పపై పోటీ చేసి విజయం సాధించారు. ఆ తర్వాత 2014లో యడ్యూరప్పపై గీతా శివరాజ్‌కుమార్ పోటీ చేసి ఓడిపోయారు. 2018 లోక్‌సభ ఉప ఎన్నికలో మధు బంగారప్ప జేడీఎస్ గుర్తుపై కాంగ్రెస్-జేడీఎస్ కూటమి అభ్యర్థిగా పోటీ చేయగా బీవై రాఘవేంద్ర చేతిలో ఓటమి పాలయ్యారు. షికారిపుర నియోజకవర్గం నుంచి రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికైన ప్రస్తుత ఎంపీ బీఎస్ యడ్యూరప్ప రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది.