Shashi Tharoor Rajeev Chandrasekhar Open Debate :ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు ఒకే వేదికపై నిలబడి ఓపెన్ డిబేట్ చేసుకునే సీన్ మనకు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో కనిపిస్తుంటుంది. అదే తరహా సీన్ తొలిసారిగా మన దేశ లోక్‌సభ ఎన్నికల్లోనూ కనిపించబోతోంది! దేశంలోనే తొలి ఓపెన్ డిబేట్‌కు కేరళలోని తిరువనంతపురం లోక్‌సభ స్థానం వేదికగా నిలవబోతోంది!
అక్కడి నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి, సిట్టింగ్ ఎంపీ శశి థరూర్, బీజేపీ తరఫున పోటీ చేస్తున్న కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ మధ్య అపూర్వమైన ఓపెన్ డిబేట్ జరగబోతోంది! అయితే ఎప్పుడు జరగనుంది? తిరువనంతపురంలో ఎక్కడ ఈ డిబేట్‌ను నిర్వహిస్తారు? అనేది ఇంకా తెలియాల్సి ఉంది.
అభివృద్ధి, రాజకీయాలపై చర్చకు సై
తిరువనంతపురం లోక్‌సభ స్థానానికి సంబంధించిన అభివృద్ధిపై శశి థరూర్‌తో చర్చించేందుకు తాను సిద్ధమని బీజేపీ అభ్యర్థి, కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఇటీవల ప్రకటించారు. దీనికి సంబంధించిన ఒక వీడియో బాగా వైరల్ అయింది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే శశిథరూర్ దీనిపై వెంటనే స్పందించారు. రాజీవ్ సవాల్‌ను స్వీకరించేందుకు తాను సిద్ధమని వెల్లడించారు.
ఇప్పటివరకు బహిరంగ చర్చ నుంచి ఎవరు తప్పించుకుంటున్నారో నియోజకవర్గంలోని ఓటర్లకు తెలుసని థరూర్ విమర్శించారు. ఒకచోటకు చేరి రాజకీయాలు, అభివృద్ధి గురించి చర్చిద్దామని శశిథరూర్ ఎక్స్ వేదికగా పిలుపునిచ్చారు. "ధరల పెంపు, నిరుద్యోగం, అవినీతి, మతతత్వం, బీజేపీ పదేళ్ల ద్వేషపూరిత రాజకీయాల గురించి మాట్లాడుదాం. గత 15 ఏళ్లలో తిరువనంతపురం సాధించిన అభివృద్ధి గురించి కూడా చర్చిద్దాం" అని ఆయన పేర్కొన్నారు.
తిరువనంతపురంలో బీజేపీ అభ్యర్థుల ప్రస్థానం
ఇంతకుముందు తిరువనంతపురం నుంచి బీజేపీ పోటీ చేసినప్పటికీ కేంద్ర మంత్రి స్థాయి అభ్యర్థులను ఇక్కడి నుంచి బరిలోకి దింపలేదు. తొలిసారిగా ఇక్కడి నుంచి పోటీ చేస్తున్న కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఉన్నారు. ఆయన క్షేత్రస్థాయిలో జోరుగా ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. తిరువనంతపురం నగరానికి కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన వివిధ ప్రాజెక్టుల గురించి ప్రజలకు వివరిస్తున్నారు. అవినీతికి తావులేని బీజేపీ సర్కారునే ఎన్నుకోవాలని ఓటర్లను కోరుతున్నారు.
2019 లోక్‌సభ ఎన్నికలలో తిరువనంతపురం నుంచి పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి కుమ్మనం రాజశేఖరన్‌ను శశిథరూర్ దాదాపు లక్ష ఓట్ల తేడాతో ఓడించారు. పోలైన మొత్తం ఓట్లలో 41 శాతం థరూర్‌కే పడ్డాయి. అంతకుముందు 2014లో బీజేపీ తరఫున రాజగోపాల్ పోటీ చేయగా తొలి రౌండ్లలో ఆయన స్పష్టమైన ఆధిక్యాన్ని చాటుకున్నారు. అయితే చివరి రౌండ్ల ఫలితాలు కలిసి రావడం వల్ల థరూర్ గట్టెక్కారు. అప్పట్లో కేవలం 15వేల ఓట్ల స్వల్ప తేడాతో ఆయన గెలిచారు. థరూర్ గత మూడు పర్యాయాలుగా తిరువనంతపురం లోక్‌సభ స్థానం నుంచి గెలుస్తూ వస్తున్నారు. కేరళలో పోలింగ్ ఏప్రిల్ 26న జరగబోతోంది. ఫలితాలు జూన్ 4న వెలువడితే కానీ, తిరువనంతపురంలో విజేత ఎవరనేది మనకు తెలియదు.