Shahjahan Sheikh Arrest :బంగాల్లోని సందేశ్‌ఖాలీలో మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడిన్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న టీఎంసీ నేత షేక్ షాజహాన్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఉత్తర 24 పరగణాల జిల్లా మినాఖాలోని ఓ ఇంటిలో ఉంటున్న షాజహాన్‌ను గురువారం ఉదయం అరెస్టు చేసి బసిర్హాట్ కోర్టుకు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు. న్యాయస్థానం షాజహాన్‌కు 10 రోజుల పోలీసు కస్టడీ విధించింది. రాష్ట్ర పోలీసులు 14 రోజులు కోరగా కోర్టు 10 రోజులు కస్టడీ విధించింది. షాజహాన్‌ను బంగాల్ పోలీసులు కోల్‌కతాలోని భబానీ భవన్‌కు తరలించారు. మరోవైపు షాజహాన్‌పై నమోదైన కేసులను బంగాల్ సీఐడీ దర్యాప్తు చేపట్టింది.
'లైంగిక వేధింపుల కేసులో కాదు'
అయితే షేక్ షాజహాన్‌ను లైంగిక వేధింపుల కేసులో అరెస్ట్ చేయలేదని దక్షిణ బంగాల్ ఏడీజీ సుప్రతిమ్ సర్కార్ అన్నారు. ఈడీ అధికారులపై దాడి చేసిన కేసులో అరెస్ట్ చేసినట్లు చెప్పారు. జనవరి 5న జరిగిన ఈ దాడి ఘటనలో షాజహాన్ ప్రధాన నిందితుడని తెలిపారు. 'ఈ కేసు సెక్షన్ 354కి సంబంధించినది కాదు. షాజహాన్‌పై చాలా కేసులు ఉన్నాయి. ఫిబ్రవరి 8, 9న నమోదైన కేసులన్నీ రెండు నుంచి మూడు సంవత్సరాల క్రితం జరిగిన ఘటనలకు సంబంధించినవి. ముఖ్యంగా రెండు సంవత్సరాల క్రితం జరిగిన వాటిని దర్యాప్తు చేయడానికి, సాక్ష్యాలను సేకరించడానికి సమయం పడుతుంది' అని దక్షిణ బంగాల్ ఏడీజీ తెలిపారు.
షాజహాన్ షేక్ ఇంట్లో జనవరి 5న తనిఖీల కోసం వెళ్లిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ బృందంపై ఒక గుంపు దాడి చేసినప్పటి నుంచి ఆయన కనిపించకుండా పోయారు. అప్పటి నుంచి దాదాపు 50 రోజులకు పైగా ఆయన పరారీలో ఉన్నారు. ఆయన అరెస్టును డిమాండ్ చేస్తూ సందేశ్‌ఖాలీ ప్రాంత ప్రజలు హింసాత్మక నిరసనలు చేపట్టారు. ఈడీ, సీబీఐ సైతం ఆయన్ను అరెస్టు చేయొచ్చని కలకత్తా హైకోర్టు బుధవారమే స్పష్టం చేసింది.
'ప్రజాస్వామ్యం అంటే ఇదే'
షేక్ షాజహాన్ అరెస్టుపై బంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్ స్పందించారు. 'ప్రజాస్వామ్యం అంటే ఇదే. దీని కోసమే ఇప్పటి వరకు ఎదురు చూశాం. అది ఇప్పుడు జరిగింది. ఇది అందరికీ గుణపాఠాన్ని నేర్పిస్తుంది. ఇప్పుటి నుంచి బంగాల్లో చట్టబద్దమైన పరిపాలన ఉంటుందని అశిస్తున్నా' అని గవర్నర్ ఆనంద బోస్ అన్నారు.