International Yoga Day : యోగా వల్ల కొత్త ఆర్థిక వ్యవస్థ రూపుదిద్దుకుందని ప్రధాని నరేంద్ర మోదీ వివరించారు. జమ్ముకశ్మీర్ శ్రీనగర్‌లోని దాల్ సరస్సు ఒడ్డునున్న షేర్ -ఏ-కశ్మీర్ అంతర్జాతీయ సమావేశ కేంద్రం వద్ద నిర్వహించిన యోగా కార్యక్రమంలో మోదీ పాల్గొన్నారు. 50 వేల మంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పదేళ్లుగా ప్రపంచవ్యాప్తంగా యోగా దినోత్సవం జరుపుకొంటున్నామన్న మోదీ, విదేశాల్లో యోగా చేసే వారిసంఖ్య క్రమంగా పెరుగుతోందన్నారు. ఒక్క జర్మనీలోనే నిత్యం కోటిమందికి పైగా యోగా చేస్తున్నారని వివరించారు. యోగా నేర్పేందుకు వందల సంఖ్యలో సంస్థలు వెలిశాయని గుర్తుచేశారు. యోగా నేర్పే మహిళకు పద్మశ్రీ పురస్కారం దక్కిందన్న మోదీ, భారత్‌లోని అనేక వర్సిటీలు యోగా కోర్సులు ప్రారంభించాయన్నారు. కోట్ల మందికి యోగా అనేది దైనందిన కార్యక్రమమైందని వివరించారు. ధ్యానంతో ఏకాగ్రత, యోగాతో అపారశక్తి కలుగుతాయన్నారు.
"గత 10 ఏళ్లలో యోగా విస్తరించిన తీరు యోగాకు సంబంధించిన అవగాహనను మార్చింది. నేడు, ప్రపంచం కొత్త యోగా ఆర్థిక వ్యవస్థను చూస్తోంది. భారతదేశంలో, రిషికేశ్, కాశీ నుంచి కేరళ వరకు యోగా పర్యాటకానికి సంబంధించిన కొత్త వాణిజ్యం కనిపిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పర్యాటకులు భారతదేశంలో ప్రామాణికమైన యోగా నేర్చుకోవాలని కోరుకునేందుకు భారతదేశానికి వస్తున్నారు. ప్రజలు తమ ఫిట్‌నెస్ కోసం వ్యక్తిగత యోగా శిక్షకులను నియమించుకుంటున్నారు. సంస్థలు కూడా ఉద్యోగుల కోసం యోగా ఇతర కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి. ఇవన్నీ యువతకు కొత్త అవకాశాలను, కొత్త ఉపాధి అవకాశాలను సృష్టించాయి." అని మోదీ చెప్పారు.
యోగాసనాలు వేసిన కేంద్రమంత్రులు
దేశవ్యాప్తంగా పలువురు కేంద్రమంత్రులు, ఎంపీలు, ముఖ్యమంత్రులు యోగా కార్యక్రమాల్లో పాల్గొని యోగాసనాలు వేశారు. ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో యోగాగురు రామ్‌దేవ్ బాబా, ఆచార్య బాలకృష్ణతో కలిసి యోగాసనాలు వేశారు. ఆ కార్యక్రమానికి చిన్నారులతో పాటు పెద్దలు పెద్ద ఎత్తున తరలి వచ్చి యోగా చేశారు. దిల్లీలో కేంద్రమంత్రులు బీఎల్ వర్మ, హెచ్‌డీ కుమారస్వామి, కిరణ్ రిజిజు, రాజ్‌నాథ్‌సింగ్, జేపీ నడ్డా తదితరులు 10వ అంతర్జాతీయ యోగాదినోత్సవాన్ని యోగాసనాలు వేసి జరుపుకొన్నారు.