Aadhaar and Birth Certificate Correction Issues : హైదరాబాద్ నగరంలో విద్యార్థుల తల్లిదండ్రులకు నిద్ర కరవైంది. ఓ వైపున కేంద్ర ప్రభుత్వం చెప్పిందంటూ పాఠశాలలు అపార్ ఐడీ కోసం విద్యార్థుల తల్లిదండ్రులపై ఒత్తిడి పెంచుతున్నాయి. సరే కావాల్సిన పత్రాలను అందజేద్దామని స్కూల్‌కు వెళ్తే ఆధార్‌కార్డు, జనన ధ్రువీకరణపత్రంలో పేర్లు సరిపోలట్లేదు. కొంతమంది పిల్లలకు ఆధార్‌కార్డులే లేవు. అలాంటి వారందరితో మీసేవా కేంద్రాలు కిక్కిరిసిపోతున్నాయి. ఇదే అదనుగా తీసుకుని దళారులు రెచ్చిపోతున్నారు. జనన ధ్రువీకరణపత్రానికి(బర్త్ సర్టిఫికెట్) రూ.3 వేలు, ఆధార్‌కార్డు సవరణకు రూ.5 వేలు అంటూ కొన్ని చోట్ల దందా చేస్తున్నారు. జీహెచ్‌ఎంసీలో అవసరం లేని డాక్యుమెంట్లను అడుగుతూ ఆయా దరఖాస్తులను తిరస్కరిస్తున్నారు.
పెండింగ్‌లో 9వేల దరఖాస్తులు : కోఠి ప్రసూతి, ఇతర ఆసుపత్రులకు కాన్పుల కోసం వివిధ జిల్లాల నుంచి పేద, మధ్య తరగతి కుటుంబాలు వరుస కడుతుంటాయి. ఆసుపత్రుల్లోని కొందరు సిబ్బంది జీహెచ్‌ఎంసీకి ఇచ్చే ఆన్‌లైన్ రికార్డుల్లో తల్లిదండ్రుల పేర్లను తప్పుగా నమోదు చేస్తున్నారు. కొన్నేళ్లకు పాఠశాలలోనో, ఆధార్ కార్డు కోసమో సర్టిఫికెట్‌లోని తప్పులను సవరించుకోవాల్సిన ఇబ్బందికర పరిస్థితి తలెత్తుతోంది. అప్పుడు జిల్లాల నుంచి అర్జీ చేసుకుంటే జీహెచ్‌ఎంసీ అధికారులు తిరస్కరిస్తారు. ఇక్కడికొచ్చి అప్లికేషన్ సమర్పించి, మధ్యవర్తి ద్వారా ముడుపులు చెల్లించుకుంటేనే సర్టిఫికెట్ జారీ అవుతోంది. నగరంలోని 30 సర్కిళ్లలో కలిపి ప్రస్తుతం జీహెచ్‌ఎంసీ వద్ద సవరణ కేటగిరీలోని దరఖాస్తులు 9,000 ఉండటమే అందుకు నిదర్శనం.
ఉప్పల్ సర్కిల్లో : ఉప్పల్ సర్కిల్‌లోని సహాయ మున్సిపల్ కమిషనర్ రోజుకు లెక్కపెట్టి 20దరఖాస్తులను మాత్రమే పరిశీలించి, డిజిటల్ ‘కీ’ని సంచిలో వేసుకుంటున్నారు. ప్రస్తుతం ఆమె వద్ద ఎనిమిది వందల అర్జీలు పెండింగులో ఉన్నాయి. ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రులు ఉన్న మెహిదీపట్నం, బేగంపేట, మలక్‌పేట, గోషామహల్ తదితర సర్కిళ్లలో 500-800 దరఖాస్తులు పెండింగులో ఉండటం గమనార్హం.
మూడు పత్రాలు ఎందుకు? : తల్లిదండ్రుల పేర్ల సవరణకు సంబంధించి జీహెచ్‌ఎంసీ 3 రకాల ధ్రువీకరణపత్రాలను సమర్పించాలని చెబుతోంది. అందులో వివాహ నమోదు సర్టిఫికెట్‌ను(మ్యారేజ్ సర్టిఫికెట్) తప్పనిసరి చేశారు. చట్టం ప్రకారం, సర్కారు జారీ చేసినటువంటి పత్రాల్లో ఏవేనీ రెండింటిని సమర్పిస్తే సరిపోతుంది. వివాహ ధ్రువీకరణపత్రాన్ని ఎందుకు తప్పనిసరి చేశారని అధికారులను వివరణ కోరగా వారు సమాధానాన్ని చెప్పలేకపోయారు. కిందిస్థాయిలోని సహాయ మున్సిపల్ కమిషనర్లు, సహాయ వైద్యాధికారులు జనన, మరణ ధ్రువీకరణపత్రాల(బర్త్, డెత్ సర్టిఫికెట్) జారీని అదనపు బాధ్యతగా భావిస్తున్నారని, సరిగా పని చేయడం లేదంటూ సదరు అధికారి వాపోయారు. గ్రేటర్లో ఏటా నమోదయ్యే జననాలు 2.2 లక్షలు నుంచి 2.5 లక్షలు ఉండగా, ధ్రువీకరణ పత్రాల్లో సవరణ కోరుతూ వచ్చే దరఖాస్తులు 40 వేల నుంచి 45 వేల వరకు ఉంటున్నాయి.
ఈ ప్రశ్నలకు బదులేది?
- తల్లిదండ్రుల పేర్ల సవరణ కోసం వివాహ నమోదు సర్టిఫికెట్ ఎందుకు తప్పనిసరి?
- సర్టిఫికెట్‌లో సవరణ కోసం రెండింటికి బదులు 3 రకాల పత్రాలను ఎందుకు అడుగుతున్నారు?
- మీసేవా కేంద్రాల్లో దరఖాస్తు సమర్పిస్తే జీహెచ్‌ఎంసీలో తిరస్కరిస్తున్నారు. ఆ విషయాలను పౌరుడికి ఎవరు చెప్పాలి?
- సరైన కారణం చెప్పకుండా తిరస్కరించడం ఏంటి?
పోస్టాఫీసుల్లో పాస్‌పోర్టు స్లాట్స్ - అంగన్వాడీ కేంద్రాల్లో ఆధార్ సేవలు