Bandra Railway Station Stampede: ముంబయిలోని బాంద్రా రైల్వే స్టేషన్లో జరిగిన తొక్కిసలాటలో తొమ్మిది మంది గాయపడ్డారు. ఒకటో నంబర్ ప్లాట్ ఫామ్‌పైకి భారీగా ప్రయాణికులు ఒక్కసారిగా రావడం వల్ల ఆదివారం వేకువజామున ఈ ఘటన జరిగింది. క్షతగాత్రులను సమీపంలో బాబా ఆస్పత్రికి తరలించారు. వారిలో ఏడుగురు పరిస్థితి నిలకడగా ఉండగా, మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు బృహన్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) తెలిపింది.
ప్రయాణికులతో కిటకిట
దీపావళి, ఉత్తరాదిలో ఛత్ పూజ ఉండడం వల్ల సొంతూళ్లకు వెళ్లేందుకు వచ్చిన ప్రయాణికులతో బాంద్రా రైల్వేస్టేషన్ కిక్కిరిపోయింది. బాంద్రా నుంచి గోరఖ్‌పుర్‌కు వెళ్లే రైలు ఒకటో నంబర్ ప్లాట్ ఫామ్ పైకి రాగానే ప్రయాణికులు ఒక్కసారిగా పోటెత్తారు. అన్రిజర్వ్డ్ బోగీల్లో ఎక్కేందుకు ప్రయత్నించారు. రైలు కోసం క్యూలో నిల్చున్న ప్రయాణీకులు, ఒక్కసారిగా కోచ్‌ల వైపు దూసుకెళ్లడం వల్ల కొందరు ప్లాట్ ఫామ్‌పై పడిపోయారు. దీంతో తొక్కిసలాట జరిగింది. ఈ ప్రమాదంలో 9మంది క్షతగాత్రులయ్యారు. సమాచారం అందుకున్న రైల్వే అధికారులు ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఉదయం 5.10 గంటలకు రావాల్సిన బాంద్రా- గోరఖ్‌పుర్ ఎక్స్‌ప్రెస్ వేకువజామున 2.55గంటలకే ఫ్లాట్‌ఫామ్‌కు వచ్చేసినట్లు తెలుస్తోంది. దీంతో ప్రయాణికులు ఒక్కసారిగా పోటెత్తడం వల్ల ఈ ప్రమాదం జరిగింది.