Army Bus Accident : జమ్ముకశ్మీర్‌లో వాహనం లోయలోపడి ఐదుగురు సైనికులు మృతిచెందారు. మరో ఐదుగురు గాయపడ్డారు. పూంఛ్ జిల్లా ఎల్ఓసీ సమీపంలోని ఘరోయా ప్రాంతంలో మంగళవారం సాయంత్రం ఈ ప్రమాదం జరిగింది. జవాన్ల వాహనం 300 అడుగుల లోతున్న లోయలో పడిపోయింది. ప్రమాద సమయంలో వాహనంలో డ్రైవర్‌తో సహా 10 మంది ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే సహాయక బృందాలు ఘటనాస్థలికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ చేపట్టాయి. అయితే ఈ ఘటనలో ఉగ్ర కోణం లేదని సైన్యం తెలిపింది.
ప్రమాదానికి గల కారణాలను తెలుసుకుంటున్నామని డిఫెన్స్ ప్రతినిధి ఒకరు తెలిపారు. బహుశా రోడ్డు మలుపు వద్ద డ్రైవర్ నియంత్రణ కోల్పోయి ఉండవచ్చని అన్నారు. బనోయికి ఆరు వాహనాలతో కూడిన కాన్వాయ్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని వెల్లడించారు. ఇదిలా ఉండగా, లోయ నుంచి జవాన్ల మృతదేహాలను వెలికి తీసినట్లు ఆర్మీ అధికారులు తెలిపారు. గాయపడిన సైనికులను పూంఛ్‌లోని ఫీల్డ్ ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు. అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉందన్నారు.
లెఫ్టినెంట్ జనరల్ MV సుచింద్ర కుమార్, ధృవ కమాండ్ అన్ని ర్యాంకుల అధికారులు ఐదుగురు వీర జవాన్ల మృతి పట్ల ప్రగాఢ సంతాపాన్ని తెలిపాయని నార్తర్న్ కమాండ్ పేర్కొంది. ఇక, మృతుల కుటుంబాలకు తాము అండగా నిలుస్తామని ధృవ కమాండ్ తెలిపింది.
కాంగ్రెస్ సంతాపం
సైనికులు మరణం పట్ల కాంగ్రెస్ సంతాపం తెలియజేసింది. సైనికులు దేశానికి చేసిన నిస్వార్థ సేవను ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కొనియాడారు. ఈ ఘటన చాలా బాధాకరమైందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. మృతులు కుటుంబాలకు సంతాపం తెలిపారు. గాయపడిన సైనికులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ ఈ ఘటన పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.