Security Breach In Parliament :పార్లమెంట్ లో మరోసారి భద్రతా వైఫల్య ఘటన కలకలం సృష్టిస్తోంది. ఓ యువకుడు పార్లమెంట్ గోడ దూకి లోపలికి చొరబడేందుకు యత్నించాడు. శుక్రవారం మధ్యాహ్నం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అధికారిక వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం, నిన్న మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో 20 ఏళ్ల వయసున్న ఓ యువకుడు ఇంతియాజ్ ఖాన్ మార్గ్‌వైపు ఉన్న గోడ దూకి పార్లమెంట్ అనెక్స్ భవనం పరిసరాల్లోకి ప్రవేశించాడు. అతడిని గమనించిన సీఐఎస్‌ఎఫ్ భద్రతా సిబ్బంది వెంటనే అదుపులోకి తీసుకుని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. నిందితుడి వద్ద ఎలాంటి ఆయుధాలు లేవని నిర్ధరించుకున్న తర్వాత అతడిని దిల్లీ పోలీసులకు అప్పగించారు.
నిందితుడు ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన మనీశ్‌గా పోలీసులు గుర్తించారు. ఎత్తుగా ఉన్న గోడను అతడు ఎలా ఎక్కాడు? ఎందుకు పార్లమెంట్ ప్రాంగణంలోకి ప్రవేశించాడన్న దానిపై దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడి మానసిక పరిస్థితి సరిగా లేదని ప్రాథమికంగా గుర్తించినట్లు పోలీసులు వెల్లడించారు. సీసీటీవీ పుటేజ్‌ను పరిశీలిస్తున్నామని తెలిపారు.
గతంలో సైతం భద్రతా వైఫల్యం
గతేడాది పార్లమెంట్ శీతాకాల సమావేశాల వేళ లోక్‌సభలోకి ఇద్దరు దుండగులు దూసుకొచ్చిన. పార్లమెంట్‌పై ఉగ్రదాడి జరిగి 22 ఏళ్లు అయిన డిసెంబరు 13న ఆ ఘటన తీవ్ర కలకలం రేపింది. లోక్‌సభలోని పబ్లిక్ గ్యాలరీ వద్ద కూర్చున్న ఇద్దరు యువకులు సభలోకి దూకి గందరగోళం సృష్టించారు. రంగుల పొగను వదిలి భయభ్రాంతులకు గురిచేశారు. అదే సమయంలో పార్లమెంట్ వెలుపల కూడా ఇద్దరు వ్యక్తులు ఇదే రకమైన నిరసనను చేపట్టారు. ఈ ఘటన తర్వాత పార్లమెంట్‌లో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.