SC On Kejriwal Ed Arrest Case : మద్యం విధానానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో అరెస్టయిన దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్‌పై సుప్రీం కోర్టు మంగళవారం ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వలేదు. ఒకవేళ బెయిల్‌ను మంజూరు చేస్తే, అధికార విధులకు దూరంగా ఉండేందుకు సిద్ధంగా ఉండాలని సీఎం కేజ్రీవాల్‌కు సుప్రీంకోర్టు ధర్మాసనం సూచించింది. బెయిల్ పిటిషన్‌పై గురువారం లేదా వచ్చే వారం విచారణ కొనసాగే అవకాశముంది. ఇదిలా ఉండగా అరవింద్ కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీని మే20 వరకు పొడగిస్తూ దిల్లీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
ఇంత జాప్యం ఎందుకు?
ఈ కేసు దర్యాప్తులో తీవ్ర జాప్యం ఎందుకు జరిగిందని ఈడీని సుప్రీం కోర్టు ప్రశ్నించింది. దిల్లీ మద్యం కేసులో తనను ఈడీ అరెస్ట్ చేయడాన్ని సవాల్ చేస్తూ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌పై న్యాయమూర్తులు జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఈ మేరకు వ్యాఖ్యలు చేసింది.
దిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఒకవేళ బెయిల్‌ను మంజూరు చేస్తే, అధికార విధులకు దూరంగా ఉండాలని, ఒకవేళ అధికారిక విధులను కేజ్రీవాల్ నిర్వర్తిస్తే, కేసు విచారణకు విఘాతం కలుగుతుందని సుప్రీం కోర్టు పేర్కొంది. దీనిపై స్పందించిన కేజ్రీవాల్ బెయిల్ మంజూరైతే తాను లిక్కర్ స్కాంతో ముడిపడిన ఫైళ్లకు దూరంగా ఉంటానని కోర్టుకు హామీ ఇచ్చారు. 'కేజ్రీవాల్ ఒక ప్రజాప్రతినిధి. ఆయన కూడా ఈ ఎన్నికల్లో ప్రచారం చేయాల్సి ఉంది. అందుకే మధ్యంతర బెయిల్‌ను కోరుతూ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌పై తప్పక వాదనలు వింటాం' అని సుప్రీంకోర్టు బెంచ్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది.
'రెండేళ్ల సమయం ఎందుకు పట్టింది?'
ఈ కేసులో నిజానిజాల్ని వెలికితీయడానికి రెండేళ్ల సుదీర్ఘ సమయం ఎందుకు పట్టిందని ఈడీని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. సాక్షులు, నిందితులను నేరుగా ప్రశ్నలను ఎందుకు అడగలేదని కేంద్ర దర్యాప్తు సంస్థను నిలదీసింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోదియా అరెస్టుకు ముందు, తర్వాతి కేసు ఫైళ్లను సమర్పించాలని సుప్రీంకోర్టు ఈడీని ఆదేశించింది.