SC On Delhi Water Crisis :దిల్లీ సర్కారుకు సుప్రీంకోర్టు చురకలు అంటించింది. హిమాచల్ ప్రదేశ్ నుంచి దిల్లీకి నదీ జలాలు విడుదలవుతున్నా కోర్టుకు ఎదుట అబద్ధాలు ఎందుకు చెబుతున్నారని ప్రశ్నించింది. దిల్లీకి వస్తున్న నీళ్లన్నీ ఏమవుతున్నాయని ఆప్ సర్కారును దేశ సర్వోన్నత న్యాయస్థానం నిలదీసింది.
'దిల్లీలో నీటిని వృథా చేస్తున్నారని, ట్యాంకర్ మాఫియా రెచ్చిపోతోందనే అంశాలపై న్యూస్ ఛానళ్లలో వస్తున్న వార్తలను మేం చూస్తున్నాం. ఈ విషయాలపై మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ట్యాంకర్ మాఫియాకు మీరు అడ్డుకట్ట వేయలేకపోతే చెప్పండి. ఈ విషయంలో చర్యలు తీసుకోవాలని దిల్లీ పోలీసులను ఆదేశిస్తాం' అని జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ ప్రసన్న బి వరాలేలతో కూడిన వెకేషన్ బెంచ్ ఆప్ సర్కారుకు తేల్చి చెప్పింది.
హరియాణా, యూపీ, హిమాచల్‌తో సహా ఇతర రాష్ట్రాల నుంచి అదనపు నీటిని విడుదల చేయాలని కేజ్రీవాల్ సర్కార్ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు బుధవారం విచారించింది. దిల్లీ ప్రభుత్వం తరఫున న్యాయవాది షాదన్ ఫరాసత్ వాదనలు వినిపిస్తూ ఆప్ సర్కారు నీటి వృథాను అరికట్టేందుకు ప్రయత్నిస్తోందన్నారు. దీంతో నీటి వృథాను అరికట్టేందుకు, ట్యాంకర్ మాఫియాకు చెక్ పెట్టేందుకు చేపడుతున్న చర్యల వివరాలతో ఒక అఫిడవిట్‌ను దాఖలు చేయాలని ఆప్ సర్కారును సుప్రీంకోర్టు ఆదేశించింది. రెండు రోజుల్లో ఆ అఫిడవిట్‌ను సమర్పించాలని సూచించింది. ఈ అంశంపై తదుపరి విచారణను గురువారానికి వాయిదా వేసింది.