Sandeshkhali Incident Supreme Court :బంగాల్‌ను కుదిపేస్తోన్న సందేశ్‌ఖాలీ కేసులో కోర్టు పర్యవేక్షణలో సీబీఐ లేదా సిట్‌తో విచారణ జరిపించాలని కోరుతూ దాఖలైన పిల్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈ ఘటనను మణిపుర్ పరిస్థితులతో పోల్చొద్దని పిటిషనర్‌కు సూచించింది. జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఆగస్టిన్ జార్జ్ మాసిహ్‌లతో కూడిన ధర్మాసనం సోమవారం పిల్‌ను పరిశీలించింది.
ఇప్పటికే ఈ కేసును కలకత్తా హైకోర్టు సుమోటోగా తీసుకున్న విషయాన్ని ధర్మాసనం గుర్తుచేసింది. ఈ కేసును సీబీఐకి బదిలీ చేసే అంశాన్ని హైకోర్టు పరిశీలించవచ్చని తెలిపింది. 'పరిస్థితులను సరిగ్గా అంచనా వేసేందుకు స్థానిక హైకోర్టు ఉత్తమమైన వేదిక. రెండుచోట్లా విచారణలు అనవసరం' అని పేర్కొన్న సుప్రీం ధర్మాసనం ఈ అంశంపై హైకోర్టును ఆశ్రయించేందుకు పిటిషనర్‌కు అనుమతి మంజూరు చేసింది.
పార్లమెంటరీ కమిటీ చేపట్టిన దర్యాప్తుపై సుప్రీంకోర్టు స్టే
సందేశ్‌ఖాలీ కేసులో పార్లమెంటరీ కమిటీ చేపట్టిన దర్యాప్తుపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. దీనిపై లోక్‌సభ సెక్రటేరియట్, కేంద్ర హోంశాఖకు సర్వోన్నత న్యాయస్థానం నోటీసులు జారీ చేసింది. మహిళలపై రాజకీయ నాయకులు, గూండాలు లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారన్న ఆరోపణలతో సందేశ్‌ఖాలీలో గత కొద్ది రోజులుగా ఆందోళనలు జరుగుతున్నాయి. ఇటీవల బాధితులను కలిసేందుకు వెళ్తుండగా జరిగిన ఘర్షణల్లో బంగాల్ బీజేపీ చీఫ్, ఎంపీ సుకాంత మజుందార్ గాయపడ్డారు. దీంతో ఆయన లోక్‌సభ సచివాలయానికి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా దర్యాప్తు చేపట్టిన లోక్‌సభ సెక్రటేరియట్ ప్రివిలేజెస్ కమిటీ బంగాల్ చీఫ్ సెక్రటరీ, రాష్ట్ర డీజీపీ, ఇతర ఉన్నతాధికారులకు నోటీసులు జారీ చేసింది. సోమవారం (ఫిబ్రవరి 19న) కమిటీ ఎదుట హాజరుకావాలని ఆదేశించింది. దీనిపై బంగాల్ సర్కారు సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
ఈ పిటిషన్‌పై సోమవారం దర్యాప్తు చేపట్టిన సుప్రీంకోర్టు నాలుగు వారాల్లోగా స్పందన తెలియజేయాలంటూ లోక్‌సభ సెక్రటేరియట్, బీజేపీ ఎంపీ సుకాంత మజుందార్, కేంద్ర హోంశాఖకు నోటీసులు జారీ చేసింది. అప్పటిదాకా లోక్‌సభ కమిటీ దర్యాప్తుపై స్టే విధిస్తున్నట్లు తెలిపింది. అనంతరం తదుపరి విచారణను వాయిదా వేసింది.