Sameer Wankhede ED Case :నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో మాజీ జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడేపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) కేసు నమోదు చేసింది. బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్‌ను డ్రగ్స్ కేసులో నిందితుడిగా చేర్చకుండా ఉండేందుకు లంచం అడిగారంటూ సమీర్ వాంఖడేపై ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలపై ఇప్పటికే సీబీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. తాజాగా ఈడీ కూడా వాఖండేపై మనీలాండరింగ్ నిరోధక చట్టం కింద FIR నమోదు చేసిందని అధికారిక వర్గాలు వెల్లడించాయి. పలువురు ఎన్‌సీబీ మాజీ అధికారులకు కూడా ఈడీ సమన్లు జారీ చేసింది.
'ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో లంచం'- NCB మాజీ డైరెక్టర్‌పై ఈడీ మనీలాండరింగ్ కేసు
Sameer Wankhede ED Case : బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో ఎన్‌సీబీ ముంబయి విభాగం మాజీ జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడేపై ఈడీ మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది. లంచం డిమాండ్ చేశారన్న ఆరోపణల నేపథ్యంలో ఈడీ కేసు నమోదు చేస్తూ నిర్ణయం తీసుకుంది.
Published : Feb 10, 2024, 11:59 AM IST
|Updated : Feb 10, 2024, 12:34 PM IST
'న్యాయ వ్యవస్థపై పూర్తి నమ్మకం ఉంది'
మరోవైపు తనపై ఈడీ మనీలాండరింగ్ కేసు పెట్టడంపై సమీర్ వాంఖడే స్పందించారు. తనకు న్యాయవ్యవస్థపై పూర్తి నమ్మకం ఉందని చెప్పారు. "సీబీఐ ఇచ్చిన వివరాల ఆధారంగా ఈడీ నాపై కేసు నమోదు చేసింది. ఇది నన్ను ఆశ్చర్యానికి గురి చేసింది. అది ఇప్పటికే బొంబాయి హైకోర్టులో విచారణలో ఉంది. ఈ కేసు విచారణలో ఉన్న సమయంలో నేను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేను. కోర్టుకు సరైన సమయంలో ఆధారాలు ఇస్తాను." అని వాంఖడే తెలిపారు.
ఇదీ కేసు
2021లో NCB ముంబయి జోనల్ డైరెక్టర్‌గా వాంఖడే ఉన్నప్పుడు డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్‌ను అరెస్ట్ చేశారు. ఈ కేసు అప్పట్లో దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమైంది. ఆ కేసులో ఆర్యన్ ఖాన్‌కు NCB క్లీన్‌చిట్ ఇచ్చింది. ఆ తర్వాత వాంఖడేపై పలు ఆరోపణలు రావడం వల్ల జోనల్ డైరెక్టర్ పదవి నుంచి బదిలీ చేసి, విచారణ చేపట్టారు. ఈ కేసులో వాంఖడేతో పాటు మరో నలుగురు షారుక్ నుంచి రూ. 25 కోట్లు లంచం డిమాండ్ చేశారని బయటపడింది. దీంతో అంతర్గత దర్యాప్తు చేపట్టిన NCB ఆ వివరాలను సీబీఐకి అందించింది. అనంతరం వాఖండేపై కేంద్ర దర్యాప్తు సంస్థ కేసు నమోదు చేసింది. అతడికి ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయని దర్యాప్తులో తేలింది.