Sam Pitroda US Inheritance Tax : సార్వత్రిక ఎన్నికల వేళ కాంగ్రెస్ నేత శామ్ పిట్రోడా చేసిన వ్యాఖ్యలతో ఆ పార్టీ మరోసారి విమర్శల్లో చిక్కుకుంది. అమెరికాలోని ఓ విధానాన్ని ఉదహరిస్తూ పిట్రోడా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. అమెరికాలో వారసత్వ పన్ను అమల్లో ఉందని దీని ప్రకారం ఒక వ్యక్తి సంపాదించిన సొమ్ములో అతని మరణానంతరం సుమారు 45 శాతం మాత్రమే వారసులకు బదిలీ అవుతుందని పిట్రోడా తెలిపారు. మిగిలిన 55 శాతాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని, ఇది తనకు న్యాయంగా అనిపిస్తోందని పిట్రోడా వ్యాఖ్యానించారు.
"అమెరికాలో వారసత్వపు పన్ను ఉంది. ఉదాహరణకు ఒకరి దగ్గర 100 మిలియన్ డాలర్ల విలువైన సంపద ఉంటే ఆయన మరణించిన తర్వాత వారసులకు 45 శాతం మాత్రమే ఇస్తారు. మిగిలిన 55 శాతం సొత్తును ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది. ఇదో ఆసక్తికరమైన చట్టం. ఈ చట్టం ప్రకారం మీ తరంలో మీరు సంపాదించిన సంపదను ప్రజల కోసం వదిలి వేయాలి. మొత్తం కాదు, కొంత సంపదను వదిలేయాలి. ఇది నాకు న్యాయంగా అనిపిస్తోంది. కానీ భారతదేశంలో ఇది లేదు. ఎవరైనా 10 బిలియన్ల సంపద సంపాదించి చనిపోతే అతని వారసులకు ఆ 10 బిలియన్లు వస్తాయి. ప్రజలకు ఏమీ లభించదు. ఇది ప్రజలు చర్చించాల్సిన విషయం. ఎలాంటి నిర్ణయం తీసకుంటారో తెలీదు కానీ సంపద పునఃపంపిణీ గురించి మాట్లాడేటప్పుడు కొత్త విధానాలు, కొత్త కార్యక్రమాల గురించి మాట్లాడాలి. ఈ విధానాలు ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఉండాలి. ధనవంతుల ప్రయోజనాల కోసం కాదు."
-శామ్ పిట్రోడా, కాంగ్రెస్ నేత
మాటల యుద్ధం
శ్యామ్ పిట్రోడా వ్యాఖ్యలపై బీజేపీ తీవ్రంగా మండిపడింది. అలాంటి విధానాలు పౌరులకు న్యాయం చేస్తాయా అని ప్రశ్నించింది. ఒక వ్యాపారవేత్త 55 శాతం సంపదకు, ఒక రైతు 55 శాతం సొత్తుకు భారీ వ్యత్యాసం ఉంటుందని వెల్లడించింది. పిట్రోడా వ్యాఖ్యలు దుమారం రేపడం వల్ల కాంగ్రెస్ స్పందించింది. ఆ మాటలకు పార్టీకి ఎలాంటి సంబంధం లేదని, ఆయన వ్యక్తిగత అభిప్రాయమని వివరణ ఇచ్చుకుంది.
మరోవైపు ఈ వ్యాఖ్యలపై శామ్ పిట్రోడా ఎక్స్ వేదికగా వివరణ ఇచ్చారు. 'కాంగ్రెస్ మేనిఫెస్టో గురించి ప్రధాని మోదీ చేస్తున్న అబద్ధాల నుంచి దృష్టి మరల్చడానికే ఒక వ్యక్తిగా నేను చెప్పిన మాటలను వక్రీకరించడం దురదృష్టకరం. ప్రధాని మోదీ చేసిన మంగళ సూత్రం, బంగారం దోచుకోవడం అవాస్తవం. 55శాతం తీసుకుంటామని ఎవరు చెప్పారు? భారతదేశంలో ఇలాంటివి చేయాలని ఎవరు చెప్పారు? నేను ఒక ఉదాహరణగా మాత్రమే చెప్పాను' అని శామ్ పిట్రోడా వివరించారు.