Sabarimala Darshan Online Booking :కేరళ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. 2024 శబరిమల అయ్యప్ప దర్శనం కోసం ఆన్‌లైన్ బుకింగ్ ద్వారానే యాత్రికులకు అనుమతి ఇవ్వనున్నట్లు తెలిపింది. మరో నెల రోజుల్లో మకరవిళక్కు సీజన్ ప్రారంభం కానున్న వేళ ఈ నిర్ణయం వెల్లడించింది. రోజుకు గరిష్ఠంగా 80 వేల మందిని మాత్రమే దర్శనానికి అనుమతిస్తామని అధికారులు తెలిపారు.
వర్చువల్ క్యూ బుకింగ్ సమయంలో యాత్రికులు తమ ప్రయాణ మార్గాన్ని కూడా ఎంచుకునే అవకాశం ఉందని సీఎంవో ఓ ప్రకటనలో తెలిపింది. తీర్థయాత్రల సన్నాహాలను సమీక్షించేందుకు ముఖ్యమంత్రి పినరయి విజయన్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. మకరవిళక్కు సీజన్‌లో భక్తులు రద్దీ ఎక్కువగా ఉంటుంది. అందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ముందుగానే జాగ్రత్త చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది.
అటవీ మార్గంలో వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్లు అధికారులు తెలిపారు. పార్కింగ్ సమస్యలను పరిష్కరించడంపై దృష్టి పెట్టినట్లు పేర్కొన్నారు. శబరిమలకు వెళ్లే మార్గంలో రోడ్లు, దాని చుట్టూ పార్కింగ్ నిర్వహణ పనులు త్వరలో పూర్తవుతాయని చెప్పారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో ఒక అతిథి గృహ నిర్మాణం పూర్తయిందని త్వరలో మరొకటి పూర్తి కానున్నట్లు వెల్లడించారు.
భక్తుల రద్దీ నేపథ్యంలో!
గతేడాది డిసెంబరులో మండల పూజల సమయంలో శబరిమలకు భక్తులు పోటెత్తారు. ఈ క్రమంలో భక్తుల రద్దీని నియంత్రించడంలో దేవస్థానం బోర్డు విఫలమైంది. భక్తులకు కనీస వసతులు కల్పించలేక ఇబ్బందులు పడింది. కొందరు భక్తులు అయ్యప్ప దర్శనం చేసుకోకుండానే తిరిగి స్వగృహాలకు పయనమయ్యారు. అప్పట్లో దేవస్థానం బోర్డుపై విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో భక్తుల రద్దీ దృష్ట్యా ఈ ఏడాది మండల పూజలు, మకరవిళక్కు ఉత్సవాల సమయంలో స్పాట్ బుకింగ్లను దేవస్థానం బోర్డు రద్దు చేసింది.
దక్షిణ భారతదేశంలోని అతిపెద్ద పుణ్యక్షేత్రాల్లో కేరళలోని శబరిమల అయ్యప్ప దేవాలయం ఒకటి. ఈ ఆలయానికి పలు రాష్ట్రాల నుంచి మండల పూజలు, మకరజ్యోతి సమయంలో లక్షలాది మంది భక్తులు వస్తుంటారు. ఆ సమయంలో ప్రతిరోజూ 1,20,000 మందికి పైగా భక్తులు శబరిమలకు చేరుకుంటారని అంచనా. గత మండల సీజన్‌లో భక్తుల తాకిడి మరింత పెరిగింది. దర్శన సమయాన్ని గంట పెంచిన రద్దీని నియంత్రించలేకపోయారు.